
సోమవారం పుట్టిన స్త్రీ, పురుషుల లక్షణాలు, వారి భవిష్యత్తు, విజయం సాధించడానికి అనుసరించాల్సిన విధానాలపై జ్యోతిష్యపరమైన విశ్లేషణ ఇక్కడ అందించబడింది. సోమవారానికి అధిపతి చంద్రుడు కావడంతో, ఈ రోజున జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్యకు, అమావాస్య నుంచి పౌర్ణమికి వెలుగును పెంచుకుంటూ, తగ్గించుకుంటూ ఉంటాడు. ఈ చంచల స్వభావం సోమవారం పుట్టిన వారి మనస్సులో ప్రతిబింబిస్తుంది. వారి మనస్సు ఎప్పుడూ ఒకేలా ఉండదు, నిరంతరం మారుతూ ఉంటుంది.

ఊహల్లో విహరించేవారే కానీ.. ఈ చంచలత్వం వల్ల సోమవారం పుట్టిన వారు ఒకే పనిని జీవితాంతం చేయకుండా, తరచుగా పనులు లేదా వృత్తులను మార్చే లక్షణాన్ని కలిగి ఉంటారు. చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి, వీరికి ఊహాశక్తి అధికంగా ఉంటుంది. ఒక విషయాన్ని అనేక కోణాల్లో లోతుగా ఆలోచిస్తారు. విపరీతంగా ఆలోచించడం వల్ల భవిష్యత్తు గురించి భయం, గతం గురించిన బాధ వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ ఆలోచనలను పక్కన పెట్టి ప్రస్తుతంపై దృష్టి సారించడం వీరికి అవసరం. ఊహాలోకాల్లో విహరించే వీరు, తమ ఊహలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు.

తెలివితేటలతో.. సోమవారం పుట్టిన వారికి ఆత్మన్యూనతా భావం కూడా ఉంటుంది. దీనివల్ల ఏ విషయమైనా కొద్దిగా అతిశయోక్తిగా మాట్లాడే స్వభావం ఉంటుంది. ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, ఇతరులు కష్టపడి చేసే పనులను వీరు తమ తెలివితేటలతో చాలా సులభంగా పూర్తి చేస్తారు. అనేక మంది అనేక రోజులు ఆలోచించి చేసే పనిని, వీరు అతి సులువుగా చేయగలరు.

నమ్మితే ప్రాణాలిచ్చేస్తారు.. సంబంధాల విషయానికి వస్తే, సోమవారం జన్మించిన వారు ఎవరినీ అంత తొందరగా నమ్మరు. ఒకసారి నమ్మితే మాత్రం, వారి కోసం ప్రాణాలను సైతం ఇస్తారు. విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకొని, ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోకుండా ఆ స్నేహబంధాన్ని జీవితాంతం కొనసాగిస్తారు. వీరు శుభ్రతను ఎక్కువగా ఇష్టపడతారు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక వీరికి ఉంటుంది. అందరితో కలిసి ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కునే లక్షణం వీరికి ఉంది. హాస్యం కూడా వీరిలో పుష్కలంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా హాస్యం పండించగలరు. ఎదుటి వారి మనసు ఎరిగి మాట్లాడటంలో వీరు దిట్ట. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడే లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది.

వీరికి కలిసివచ్చే వ్యాపారాలు ఇవే.. వృత్తిపరంగా చూస్తే, సోమవారం పుట్టిన వారు కంప్యూటర్ రంగంలో బాగా రాణిస్తారు. కంప్యూటర్స్ నేర్చుకుంటే అద్భుతంగా విజయం సాధిస్తారు. సాంకేతిక రంగం, గణిత శాస్త్ర రంగం వీరికి బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల విషయానికి వస్తే, పాల వ్యాపారం, కాఫీ టీ వ్యాపారం, ఐస్ వ్యాపారం, శీతల పానీయాల వ్యాపారాలు చాలా మంచివి. షిప్పింగ్ వ్యాపారం, నీటి సంబంధిత ఏ వ్యాపారం చేసినా వీరికి కలిసి వస్తుంది.

శివపూజతో అదృష్టం రెట్టింపు.. అదృష్ట సంఖ్య 2 వీరికి శుభప్రదం. ఏ పని చేసినా 2, 11, 20, 29 తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవడం మంచిది. తెలుపు రంగును ఎక్కువగా ఉపయోగించాలి. సోమవారం పుట్టిన వారు చంద్రుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజూ "ఓం సోం సోమాయ నమః" అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటే జీవితంలో తొందరగా విజయం సాధిస్తారు. పూజించాల్సిన దైవం శివుడు. వీలైనప్పుడల్లా సోమవారం శివుడికి ఆవుపాలతో గాని, ఆవుపెరుగుతో గాని, పంచదార కలిపిన జలాలతో గాని అభిషేకం చేయించుకుంటూ ఉంటే సోమవారం పుట్టిన వారు జీవితంలో తొందరగా విజయం సాధిస్తారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)