
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మినప గుళ్ళు, పెరుగు 4 కప్పులు, ఉప్పు, నూనె. నూనె, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం , ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు , పసుపు, కొత్తిమీర.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా, ఒక కప్పు మినప గుళ్లను తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, ఆపై స్వచ్ఛమైన నీటిలో ఐదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత, నీటిని పూర్తిగా వంపేసి, మిక్సీలో లేదా గ్రైండర్‌లో చాలా తక్కువ నీటిని ఉపయోగించి మెత్తగా రుబ్బాలి. పిండి నలగడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి, ఓపికగా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.

రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మరొక గిన్నెలో నాలుగు కప్పుల పెరుగును తీసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి మజ్జిగలా ఉండేలా చూసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు.

చిన్న బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇవి కొంచెం వేగాక, పచ్చి మిర్చి, అల్లం, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. చివరగా చిటికెడు పసుపు వేసి, పోపును చల్లారనివ్వాలి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు మిశ్రమం కలపాలి.

తర్వాత వడలు తయారు చేసుకొని గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు నీటిలో రెండు నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వలన వడలు మెత్తగా, స్పాంజీగా తయారవుతాయి. రెండు నిమిషాల తర్వాత, నీటిలో నానిన వడలను స్ట్రైనర్ సహాయంతో బయటకు తీసి, మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా అదనపు నీటిని పిండి వేయాలి. తర్వాత పెరుగు మిశ్రమంలో వేయాలి. అంతే టేస్టీ టేస్టీ పెరుగు వడలు రెడీ.