
సాంప్రదాయ ఎర్ర ఇటుకలు (Red Clay Bricks): మనదేశంలో చాలా కాలంగా ఇళ్ల నిర్మాణానికి ఎర్ర ఇటుకలనే వాడుతున్నారు. ఇవి బలంగా ఉన్నప్పటికీ, వేడిని గ్రహించే గుణం వీటికి ఎక్కువ. పగడంతా సూర్యుడి నుండి వచ్చే వేడిని ఈ ఇటుకలు తమలో నిల్వ చేసుకుని, రాత్రి సమయంలో ఆ వేడిని ఇంటి లోపలికి విడుదల చేస్తాయి. అందువల్ల ఎర్ర ఇటుకలతో కట్టిన ఇళ్లు ఎండకాలంలో ఎక్కువ వేడిగా ఉంటాయి.

ఫ్లై యాష్ ఇటుకలు (Fly Ash Bricks): బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుండి వచ్చే బూడిద (Fly Ash)తో ఈ ఇటుకలను తయారు చేస్తారు. ఇవి ఎర్ర ఇటుకల కంటే తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇవి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, థర్మల్ ఇన్సులేషన్ పరంగా ఎర్ర ఇటుకల కంటే మెరుగ్గా పనిచేస్తాయి. వీటిని వాడటం వల్ల ఇల్లు కొంతవరకు చల్లగా ఉంటుంది.

ఏఏసీ బ్లాకులు (AAC Blocks - Autoclaved Aerated Concrete): ప్రస్తుత ఆధునిక నిర్మాణాలలో ఏఏసీ బ్లాకుల వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది. ఎండకాలంలో ఇల్లు చల్లగా ఉండటానికి ఇవి అత్యంత ఉత్తమమైనవిగా నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు అంటే: ఈ బ్లాకుల తయారీలో గాలి బుడగలు (Air pockets) ఏర్పడతాయి. ఇవి అద్భుతమైన థర్మల్ ఇన్సులేటర్లుగా పనిచేస్తాయి. అంటే, బయట ఎంత విపరీతమైన ఎండ ఉన్నా, ఆ వేడిని ఈ గోడలు ఇంటి లోపలికి రానివ్వవు. ఇవి బరువులో చాలా తేలికగా ఉంటాయి. దీనివల్ల భవనంపై భారం తగ్గుతుంది. అలాగే ఇవి సిమెంట్, ఇసుక వినియోగాన్ని కూడా తగ్గిస్తాయి.

కాబట్టి, మీరు కొత్తగా ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తుంటే, కేవలం సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా ఏఏసీ బ్లాకులు (AAC Blocks) లేదా ఫ్లై యాష్ ఇటుకలను పరిశీలించండి. ఇవి మీ ఇంటిని వేసవిలో చల్లగా ఉంచడమే కాకుండా దీర్ఘకాలంలో ఏసీ బిల్లులను కూడా ఆదా చేస్తాయి.