
ఈ రోజుల్లో నూటికి 90 మందికి పైగా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి మలం వచ్చినా ఆశించినట్టు సుఖముగా రాదు. మలం గట్టిపడి, బంకగా మారి, ఇబ్బందికరమైన స్థితికి దారితీస్తుంది. ఇలాంటి అవస్థ నుండి మిమ్మల్ని బయటపడేయటానికి సబ్జా గింజలు అద్భుతంగా పనికొస్తాయని నిపుణులు అంటున్నారు.

సాధారణంగా మంచి నీరు త్రాగటం, కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామందికి సుఖ విరోచనం అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు మలబద్ధక సమస్య నుండి బయటపడలేరు. పీచు పదార్థాలు తక్కువ తినేవారికి మలం తక్కువగా తయారై గట్టిగా వస్తుంది. ప్రేగులను శుభ్రం చేయాలంటే చీపురు లాంటివి పీచు పదార్థాలు. ఇవి జీర్ణమయ్యే పీచు, జీర్ణంకాని పీచు అని రెండు రకాలు. సబ్జా గింజలలో మెత్తగా జీర్ణమయ్యే సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ప్రేగుల పొరలను శుభ్రపరుస్తుంది. జీర్ణం కాని పీచు మలం పరిమాణాన్ని పెంచి, మెత్తగా ఉండేలా చేస్తుంది. ఈ రెండు రకాల పీచులు ఉన్న ఆహారాలను మనం ఎక్కువగా తీసుకోవాలి.

సబ్జా గింజలు ఈ సమస్య నుండి బయటపడటానికి చక్కటి మృదువైన మోషన్ సుఖంగా వెళ్ళటానికి ఉపయోగపడే మంచి పీచులను కలిగి ఉంటాయి. ఒక స్పూన్ సబ్జా గింజలలో ఆరు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. వంద గ్రాములు కొర్రలు తీసుకుంటే తొమ్మిది గ్రాములు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటే రెండు నుండి నాలుగు గ్రాముల పీచు పదార్థాలు మాత్రమే ఉంటాయి. సబ్జా గింజల్లో ఉండే ఫైబర్, ముఖ్యంగా పెక్టిన్స్, నీటిని పీల్చుకునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. తన బరువు కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. లోపలికి వెళ్ళాక, అవి ప్రేగుల్లో కదలికలను పెంచి, మలాన్ని సులభంగా ముందుకు కదలడానికి సహాయపడతాయి.

సబ్జా గింజలను తీసుకోవడం చాలా సులువు. కాస్త ఆహారం తీసుకునే పిల్లలకు నీళ్లలో, పండ్ల రసంలో, కూరగాయల రసంలో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి, ఇరవై నుండి ముప్పై నిమిషాలు నానబెట్టి తాగించండి. కావాలంటే కొద్దిగా తేనె కలిపి ఇవ్వవచ్చు. రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర స్పూన్ సబ్జా గింజలు ఉదయం జ్యూస్ తో కానీ సాయంత్రం పండ్ల రసాలతో తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో , చెరుకు రసంలో వేసుకుని తాగినా చాలా బాగుంటుంది.

రోజుకు రెండు నుండి మూడు స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 30-35 గ్రాముల పీచులో సగానికి పైగా వీటి నుంచే అందుతుంది. ఈ జీర్ణమయ్యే పీచు ప్రేగులను శుభ్రం చేయడానికి చాలా సహాయపడుతుంది. ప్రేగుల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలంటే మలం నిల్వ ఉండకూడదు. నిల్వ ఉన్న మలం నుంచే చెడ్డ సూక్ష్మజీవులు పెరిగి రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఏ రోజుకు ఆ రోజు మలం ఫ్రీగా వెళ్లాలంటే ఇలా సబ్జా గింజలను ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు.