
ఇందుకోసం ముందుగా స్టవ్‌పై గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి దించాలి. ఒక బౌల్‌లో మరిగించిన కప్పు వేడి నీటిని తీసుకుని, అందులో ఒక స్పూన్ పంచదార, తగినంత ఉప్పు వేసి బాగా కరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిలో ముందుగా ఒక కప్పు, ఆపై మరో ముప్పావు కప్పు మైదా పిండిని వేసి చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్‌గా ఉండేలా బాగా కలుపుకోవాలి.

పిండిని బాగా కలిపిన తర్వాత, కొద్దిగా నూనె వేసి చేత్తో బాగా ప్రెస్ చేస్తూ మెత్తగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి మరింత సాఫ్ట్‌గా తయారవుతుంది. పిండి ముద్దను ప్లేట్‌తో కప్పి, కనీసం 10 నిమిషాల పాటు నానబెట్టాలి. పిండి నానబెట్టే సమయంలో, ఒక చిన్న బౌల్‌లో రెండు స్పూన్ల మైదా పిండి, రెండు స్పూన్ల నూనె వేసి ఉండలు లేకుండా బాగా కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇది రుమాలి రోటీలకు పొరలు రావడానికి కీలకమైనది.

పది నిమిషాల పాటు నానిన పిండిని మరోసారి చేత్తో బాగా కలుపుకుని చిన్న చిన్న ముద్దలుగా విభజించుకోవాలి. రోటీలు చేసే పీటకు కాస్త నూనె రాసి, ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీలాగా కొద్దిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీపై ముందుగా తయారుచేసి పెట్టుకున్న మైదా-నూనె పేస్ట్‌ను అన్ని వైపులా పల్చగా సమానంగా పూయాలి.

పేస్ట్ రాసిన చపాతీని ఒక వైపు నుంచి సగం వరకు, ఆపై మరో సగం మడత పెట్టి, చివరగా దాన్ని చివరి వరకు మడతపెడుతూ ఒక దీర్ఘచతురస్రాకారంలో చేసుకోవాలి. అన్ని పిండి ముద్దలను ఇదే విధంగా మడతపెట్టి ప్లేట్‌లో ఉంచుకోవాలి. ఆ తర్వాత లేయరింగ్ చేసిన ఒక్కో ముద్దను తీసుకుని, పీటపై చపాతీలాగా నచ్చిన సైజులో పల్చగా ఒత్తుకోవాలి. మైదా పిండి కావడం వల్ల ఇది చాలా సులువుగా సాగుతుంది.

ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి బాగా వేడెక్కాక, పల్చగా ఒత్తిన రోటీని వేయాలి. ఒక వైపు కొద్దిగా కాలిన వెంటనే మరోవైపు తిప్పి నూనె రాయాలి. రోటీ పొంగుతున్నప్పుడు మళ్లీ తిప్పి రెండో వైపు కూడా నూనె రాసి, పూరీలా బాగా పొంగి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. ఇలా తయారైన వేడివేడి, మెత్తని పొరల రుమాలి రోటీలను ఆనియన్ కర్రీతో లేదా నచ్చిన కూరతో సర్వ్ చేసుకుని ఆస్వాదించవచ్చు.