
రాగి రొట్టెలకు సరైన జత పల్లి చట్నీ. దీన్ని తయారుచేయడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అర కప్పు పల్లీలను చిన్న మంట మీద దోరగా వేయించాలి. వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కారానికి తగినట్లుగా 6-8 ఎండుమిరపకాయలను వేసి కొద్దిగా వేయించాలి. వేయించిన ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టుకుని, రెండు రెమ్మల కరివేపాకుని నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి.

తర్వాత ఇందులోకి రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కావలసినంత నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని కావాలనుకుంటే అలాగే సర్వ్ చేయవచ్చు, లేదా చిన్న పోపు పెట్టుకుని కలుపుకోవచ్చు. ఇలా రుచికరమైన పల్లి చట్నీ సిద్ధమవుతుంది.

ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల రాగి పిండిని వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరుగు, అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన కరివేపాకు తరుగు, పావు కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేయండి. తరువాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ, రెండు కప్పుల సన్నగా కట్ చేసిన మెంతి ఆకులు వేసుకోవాలి. ఇక్కడ మీరు తోటకూర, పాలకూర, పొన్నగంటి ఆకు, మునగాకు, బచ్చలి కూర వంటి ఏ పులుపు లేని ఆకుకూరనైనా ఉపయోగించవచ్చు. చివరిగా, నానబెట్టిన పచ్చిశనగపప్పు పావు కప్పు వేసి అన్నింటినీ బాగా కలపండి.

ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ, రొట్టెలు చేయడానికి పిండిని ఏ విధంగా కలుపుతామో అదే విధంగా మృదువుగా, చేత్తో సులువుగా ఒత్తడానికి వీలుగా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత దానిపై మూత పెట్టి కనీసం 10-15 నిమిషాల పాటు నాననివ్వండి. పదిహేను నిమిషాల తర్వాత, నానిన పిండిలోంచి చిన్న చిన్న ముద్దలు తీసుకుని రొట్టెలుగా ఒత్తుకోవాలి. రొట్టెలను నేరుగా పెనం మీద కొద్దిగా నూనె రాసి ఒత్తుకోవచ్చు, లేదా బట్టర్ పేపర్ లేదా అరిటాకుపై ఒత్తుకుని పెనం మీద వేయవచ్చు. మీడియం మందంతో రొట్టెలను ఒత్తుకుని, పెనంపై నూనె వేస్తూ రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు, క్రిస్పీగా మారేవరకు చిన్న మంటపై కాల్చుకోవాలి. రాగి రొట్టెలను నిదానంగా కాల్చడం వలన అవి లోపల కూడా చక్కగా ఉడికి రుచికరంగా ఉంటాయి.

ఈ విధంగా అన్ని రొట్టెలను కాల్చుకుంటే, ఆరోగ్యకరమైన, రుచికరమైన రాగి రొట్టెలు సిద్ధమవుతాయి. వీటిని తయారుచేసిన పల్లి చట్నీతో వేడివేడిగా లేదా చల్లారిన తర్వాత కూడా తినవచ్చు. చట్నీ లేకపోయినా, ఈ రొట్టెలు ఒట్టివిగా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. స్నాక్‌గా కూడా వీటిని తినొచ్చు . మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన రాగి రొట్టెలు, పల్లి చట్నీని ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి.