
ముఖ్యంగా పిల్లలకు ఎంతగానో ఇష్టమైన 'మ్యాగీ మసాలా-ఏ-మ్యాజిక్' ప్యాకెట్‌తో ఈ అన్నం చేస్తే ఆ సువాసనకే పిల్లలు లంచ్ బాక్స్‌ను ఒక్క మెతుకు కూడా వదలకుండా ఖాళీ చేసి తీసుకొస్తారు. ఈ క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రైస్ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు: బాస్మతి లేదా సోనా మసూరి ఉడికించిన అన్నం, 2 స్పూన్ల నూనె, 1 - సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 - చీలికల పచ్చిమిర్చి, 1 - సన్నని క్యారెట్ తరుగు, కొద్దిగా కరివేపాకు, 2 మధ్యస్థ సైజు టమోటా సన్నని ముక్కలు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ కంటే తక్కువ పసుపు, 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా, తాజా కొత్తిమీర తరుగు

తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండీ లేదా వెడల్పాటి కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, క్యారెట్ తరుగు మరియు కొద్దిగా కరివేపాకు వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి కేవలం అర నిమిషం పాటు వేగంగా టాస్ చేస్తూ వేయించాలి.

అందులోనే సన్నగా తరిగిన రెండు టమోటా ముక్కలు వేసి మరో అర నిమిషం హై ఫ్లేమ్‌పై కలపాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 10 సెకన్ల పాటు వేగంగా వేయించాలి. ఇందులో అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం, చిటికెడు పసుపు వేయాలి. ఆ వెంటనే ప్రధాన పదార్థమైన 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా-ఏ-మ్యాజిక్ పొడిని చల్లాలి. ఇప్పటికే ఉప్పు ఉంటుంది కాబట్టి అదనపు ఉప్పును కాస్త జాగ్రత్తగా చూసుకుని వేయాలి. ఈ మసాలాలన్నీ నూనెలో బాగా కలిసేలా ఒక్కసారి తిప్పాలి.

ఇప్పుడు పొడిపొడిగా ఉడికించిన రైస్‌ను మసాలాకు సరిపడా వేసి, మంట హై ఫ్లేమ్‌లోనే ఉంచి మసాలా అంతా అన్నం మెతుకులకు పట్టేలా 10 నుండి 15 సెకన్ల పాటు వేగంగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఘుమఘుమలాడే 2-మినిట్ మ్యాగీ మసాలా రైస్ సిద్ధం! దీనికి ఎలాంటి సైడ్ డిష్ లేదా రైతా అవసరం లేదు, పిల్లలు నేరుగా ఇలాగే ఎంతో ఇష్టంగా తినేస్తారు!