
చాలా మంది తమకు ఇష్టమైన వస్తువులను కొన్నప్పుడు సంతోషంగా ఫీలవుతారు. కానీ అదే డబ్బుతో మనకు ఇష్టమైన వ్యక్తులకు నచ్చిన వస్తువులు కొని ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం దానికి రెట్టింపు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనినే ప్రోసోషల్ స్పెండింగ్ అంటారని.. అంటే మన కోసం కాకుండా ఇతరుల ప్రయోజనం కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఆనందం పొందడం అని అర్థమని చెబుతున్నారు.

Spending Money on Others Promotes Happiness అనే అధ్యయనం డబ్బు ఖర్చు చేసే విధానానికి, వ్యక్తుల సంతోషానికి మధ్య ఉన్న సంబందాన్ని పరిశీలించింది. ఈ పరిశోధనలో భాగంగా పరిశోధకులు కొంతమందికి తమ కోసం, మరికొందరికి ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేసే వారిని ఎంచుకుంది. వారితో డబ్బు ఖర్చు పెట్టించిన తర్వాత వారి ఆనందాన్ని అంచనా వేయగా.. తమ కోసం డబ్బు ఖర్చు చేసుకున్న వారి కంటే తమకు ప్రియమైన వారి కోసం డబ్బు ఖర్చు చేసిన వారే ఎక్కవ ఆనందాన్ని పొందినట్టు పరిశోధలో తేలింది.

2013లో నిర్వహించిన మరో అధ్యయనంలోనూ అచ్చం ఇలాంటి ఫలితాలే కనిపించాయి. కెనడా, ఉగాండా, భారత్, దక్షిణాఫ్రికా సహా 136 దేశాల్లో తమ కోసం డబ్బు ఖర్చు చేసుకునే వారితో పోల్చుకుంటే పక్కవారి కోసం డబ్బు ఖర్చు చేసే వారే ఎక్కవగా సంతోషంగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా పక్కవారిపై డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇలా వారు ఏ రూపంలో పక్కవారిపై ఖర్చు చేసినా అంతిమంగా ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన సానుకూల భావనలను పెంచుతుందని అధ్యయనాలు స్నష్టం చేశాయి.

మనుషులు సామాజిక జీవులు. ఒకరితో ఒకరు అనుబంధాలను కలిగి ఉంటారు.. దీని వల్ల తమకు ఇష్టమైన వారికి సహాయం చేయడం వారికి మానసిక సంతోషాన్ని ఇస్తుంది. 2014లో పబ్లిష్ అయిన ప్రోసోషల్ స్పెండింగ్ అండ్ హ్యాపీనెస్, యూజింగ్ మనీ టు బెనిఫిట్ అదర్స్ పేస్ ఆఫ్ నివేదిక ప్రకారం, ఇవ్వడం అనేది ఇతరులతో అనుబంధం, సామర్థ్యం, నియంత్రణ వంటి కీలక మానసిక అవసరాలను తీరుస్తుందని పేర్కొంది.

అయితే పక్కవారి కోసం మన పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారి జీవితంలో చేసే చిన్న చిన్న సహాయాలు కూడా మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మొత్తంగా చూస్తే, డబ్బు ఖర్చు చేయడం అంటే మన అవసరాలు తీర్చుకోవడమే కాదు. మనకు ఇష్టమైనవారికి సహాయం చేయడం, దాని వల్ల వారి ముఖాల్లో చిరునవ్వు చూడటం.. ఇది కూడా మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మన కోసం ఖర్చు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ పక్కవారి కోసం కూడా కొంత ఖర్చు చేయడం అలవాటు చేసుకుంటే మానసిక సంతృప్తిని మరింత పెంచుకోవచ్చు.