
బంగాళాదుంపలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, 'కాటెకోలేస్' అనే సహజ ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను తగ్గించి ముఖానికి సహజ మెరుపును ఇస్తాయి. బంగాళాదుంపను పలుచని ముక్కలుగా కోసి, వాటిపై కొద్దిగా నీళ్లు లేదా రోజ్ వాటర్ చల్లండి. ఆ ముక్కలతో నల్లమచ్చలు ఉన్న చోట 5 నుంచి 7 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేస్తే చర్మంలో మంచి మార్పు కనిపిస్తుంది.

బంగాళాదుంప, నిమ్మరసం మిశ్రమం: రెండు టేబుల్ స్పూన్ల బంగాళాదుంప రసంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని చిన్న కాటన్ లేదా స్పాంజ్ సాయంతో మచ్చలు ఉన్న చోట రాయండి. నిమ్మకాయలోని సహజ బ్లీచింగ్ గుణాలు, బంగాళాదుంప రసంతో కలిసి చర్మానికి తక్షణ కాంతిని అందిస్తాయి.

బంగాళాదుంప, తేనె ఫేస్ ప్యాక్: పొడి చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. రెండు చెంచాల బంగాళాదుంప రసంలో ఒక చెంచా స్వచ్ఛమైన తేనె కలిపి ముఖానికి పట్టించండి. సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం తేమను సంతరించుకుని నల్లమచ్చలు త్వరగా తగ్గుతాయి.

బంగాళాదుంప, పెరుగు ప్యాక్: చాలా రోజులుగా నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చెంచా బంగాళాదుంప గుజ్జులో ఒక చెంచా చిక్కటి పెరుగు వేసి బాగా కలపండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి కాసేపు ఆరనివ్వండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.

Note: మీది సున్నితమైన చర్మం అయితే నిమ్మరసం వాడే ముందు తప్పనిసరిగా 'ప్యాచ్ టెస్ట్' చేసుకోండి. చర్మంపై ఏవైనా సమస్యలు లేదా అలర్జీలు ఉంటే వీటిని ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పైన పేర్కొ్న్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.