
కావలసిన పదార్థాలు: 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 1 రెమ్మ కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజు అంత రసం తీసిన చింతపండు, 2 గ్లాసుల నీళ్లు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి , అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వంట నూనె, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు , 2 ఎండు మిరపకాయలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 1 పెద్ద టమాటా

తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి నూనె ఏమీ వేయకుండా 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి నువ్వులు చిటపటలాడి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసిన రసాన్ని తీసుకోవాలి. ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న నువ్వుల పొడి మొత్తాన్ని వేయాలి. ఇందులోనే 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి.

కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు వేసి నిమిషం పాటు దోరగా వేయించాలి. పప్పులు వేగాక 7-8 వెల్లుల్లి ముక్కలు, తుంచిన 2 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఆపై తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్క నిమిషం మగ్గించాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత తరిగిన పెద్ద టమాటా ముక్కలు వేసి మూతపెట్టి టమాటాలు మెత్తగా గుజ్జులా మారే వరకు మగ్గించాలి.

టమాటాలు మెత్తబడ్డాక.. ముందుగా కలిపి ఉంచుకున్న నువ్వులు-చింతపండు రసాన్ని పోయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి సుమారు 5 నిమిషాల పాటు రసాన్ని బాగా మరగనివ్వాలి. చారు చక్కగా మరిగిన తర్వాత రుచిని బ్యాలెన్స్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేయాలి. బెల్లం కరిగాక మరో ఒక్క నిమిషం పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'నువ్వుల చారు' సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ చారు కలుపుకుని తింటుంటే నువ్వుల కమ్మదనం, వెల్లుల్లి సువాసనతో అద్భుతమైన రుచినివ్వడమే కాకుండా శరీరానికి అమితమైన శక్తినిస్తుంది!