
చాలా మంది కిచెన్ చిన్నగా ఉందని గ్యాస్ స్టవ్ లేదా ఇండక్షన్ కుక్కర్ పక్కనే ఫ్రిజ్‌ను అమర్చుకుంటారు. ఓవెన్లు, టోస్టర్లను ఫ్రిజ్ పైన పెడుతుంటారు. ఇవి ఫ్రిజ్‌కు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. స్టవ్ లేదా ఇండక్షన్ నుండి వచ్చే వేడి వల్ల ఫ్రిజ్ లోపల కూలింగ్ తగ్గకుండా ఉండేందుకు.. కంప్రెసర్ మరింత కష్టపడి పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అయి, షార్ట్ సర్క్యూట్ జరగడమే కాకుండా ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

డిష్‌వాషర్: మారిన కాలంతో పాటు ఇప్పుడు మధ్యతరగతి ఇళ్లలోకి కూడా డిష్‌వాషర్లు వస్తున్నాయి. వీటిని కూడా చాలా మంది స్థలం కలిసి వస్తుందని ఫ్రిజ్ పక్కనే ఇరుకైన ప్రదేశంలో పెడుతుంటారు. డిష్‌వాషర్ గిన్నెలను శుభ్రం చేసేటప్పుడు, ముఖ్యంగా డ్రైయింగ్ సైకిల్‌లో పెద్ద ఎత్తున వేడి గాలిని, తేమను బయటకు వదులుతుంది. ఈ వేడి గాలి నిరంతరం ఫ్రిజ్ థర్మోస్టాట్, సెన్సార్లపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఫ్రిజ్ లోపల అసలు ఉష్ణోగ్రత ఎంత ఉందో సెన్సార్ సరిగ్గా పసిగట్టలేదు. ఫలితంగా ఫ్రిజ్ పదేపదే ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కంప్రెసర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.

ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు: చాలా ఇళ్లలో బెడ్‌రూమ్‌లో లేదా హాల్‌లో ఫ్రిజ్ ఉంటే.. చార్జింగ్ పెట్టడానికో లేదా సేఫ్టీ కోసమనో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను ఫ్రిజ్ పైన పడేస్తుంటారు. ఇది చాలా సాధారణంగా చేసే పెద్ద పొరపాటు. ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే రేడియేషన్, హీట్.. ఫ్రిజ్ పైభాగాన్ని వేడెక్కిస్తాయి. ఇది ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఫోన్లు కూడా త్వరగా వేడెక్కి పాడవుతాయి.

నేరుగా పడే సూర్యకాంతి: ఇంట్లో వాస్తు బాగుంటుందనో లేక వెలుతురు వస్తుందనో చాలా మంది ఫ్రిజ్‌ను కిటికీల పక్కన లేదా బాల్కనీకి దగ్గరగా ఉంచుతారు. దీనివల్ల పగటిపూట సూర్యరశ్మి నేరుగా ఫ్రిజ్ మీద పడుతుంది. నేరుగా పడే సూర్యకాంతి ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఎండ తీవ్రత వల్ల ఫ్రిజ్ బాడీ హీట్ ఎక్కితే, లోపల ఉన్న ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ ఇంట్లో గాలి ప్రసరణ బాగుండి, నీడగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి.

ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ మంచి గాలి ప్రసరణ ఉండే నీడ ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిజ్ వెనుక భాగం గోడకు కనీసం అర అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి, తద్వారా కంప్రెసర్ వేడి బయటకు వెళ్ళిపోతుంది. ఫ్రిజ్ పైన బరువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేదా ప్లాస్టిక్ కవర్లు వేయకుండా ఖాళీగా ఉంచడం మంచిది. కాబట్టి కిచెన్ సెట్టింగ్స్ మార్చేటప్పుడు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చిన్న అప్రమత్తత ఫ్రిజ్ లైఫ్‌ను పెంచడమే కాకుండా, ఇంట్లోని వారిని ప్రమాదాల నుండి కాపాడుతుంది.