
కావాల్సిన పదార్థాలు: బియ్యం: 1 కప్పు, పెసరపప్పు: 1/2 కప్పు, బెల్లం తురుము: 2 కప్పులు, నీరు (బియ్యం, పప్పు ఉడికించడానికి): 6 కప్పులు, నీరు (బెల్లం పాకానికి): 1/2 కప్పు, ఆవు నెయ్యి: 4-5 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, కిస్మిస్): 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు: 4-5, యాలకుల పొడి: 1/2 టీ స్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని నీటిలో అరగంట సేపు నానబెట్టండి. ఇలా నానబెట్టడం వలన అవి త్వరగా, మెత్తగా ఉడుకుతాయి.మనం పరమాన్నం చేయాలనుకున్న గిన్నెను వాడటం మంచిది. స్టవ్ మీద పెట్టి, 6 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, నానబెట్టి, నీటిని వంపేసిన పెసరపప్పును వేయండి. పెసరపప్పు బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక నాలుగైదు నిమిషాలు ఉడికి, కాస్త పలుకు తగిలేలా ఉంటే సరిపోతుంది. ఈ పద్ధతి వల్ల పరమాన్నం రుచి చాలా బాగుంటుంది.

మధ్యమధ్యలో కలుపుతూ బియ్యం, పప్పు రెండూ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. సుమారు ఐదు నుండి పది నిమిషాల్లో నీళ్లు ఇంకిపోయి, అన్నం పప్పు మెత్తగా ఉడుకుతాయి. అన్నం పప్పు మెత్తగా ఉడికిన తర్వాత, అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలపాలి. ప్రసాదం కోసం ఆవు నెయ్యి వాడటం మంచిది.

మరొక గిన్నెను తీసుకుని, అందులో 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక, డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, కిస్మిస్) వేసి దోరగా వేయించండి. అవి వేగిన తర్వాత, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము (లేదా పచ్చి కొబ్బరి తురుము) మరియు 4-5 లవంగాలు వేసి మరికాస్త వేయించండి. ఈ లవంగాల రుచి పరమాన్నంలో చాలా గొప్పగా ఉంటుంది. వేగిన వాటిని నెయ్యితో సహా ఒక ప్లేట్లోకి తీసుకోండి.

అదే గిన్నెలోకి 2 కప్పుల బెల్లం తురుమును, అర కప్పు నీటిని పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించండి. బెల్లం కరిగిన తర్వాత, ఒకటి రెండు నిమిషాలు పాకాన్ని మరిగించడం వల్ల పరమాన్నం రంగు, రుచి మరింత మెరుగుపడతాయి.బెల్లం పాకంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరాన్ని నలిపి వేయండి. పచ్చ కర్పూరం వాడటం వల్ల గుడి ప్రసాదం రుచి వస్తుంది. ఆ తర్వాత, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, లవంగాలు నెయ్యితో సహా పాకంలో వేసి ఒక నిమిషం పాటు ఉడికించండి. బెల్లం పాకం గిన్నెను పక్కన పెట్టి, ముందుగా ఉడికించిన అన్నం గిన్నెను తిరిగి స్టవ్ మీద ఉంచండి. అన్నాన్ని ఒకసారి బాగా కలిపి, కావాలంటే కొంచెం మెత్తగా చేయండి. ఇప్పుడు ఈ అన్నంలో బెల్లం పాకాన్ని మొత్తం పోసి బాగా కలుపుతూ ఒకటి రెండు నిమిషాలు ఉడికించండి. ఒకటి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గిన్నెపై మూత పెట్టి ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి. దీనివల్ల బెల్లం పాకం రుచి, ఫ్లేవర్స్ పరమాన్నానికి బాగా పడతాయి. ఐదు నిమిషాల తర్వాత, బెల్లం పరమాన్నం సిద్ధం.