
ఈ సందర్భంగా నూతన భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో హోప్ 4 స్పందన ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ భవనం 2026, ఆగస్టు 27న ప్రారంభమైంది. కాగా, ఈ నూతన భవన నిర్మాణానికి నాట్స్ 10,000 అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించడం గమనార్హం. ఈ పర్యటనలో కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ మానసిక వికలాంగులైన చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సులు, ఫిజియోథెరపీ సేవలను స్వయంగా పరిశీలించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసి, కేంద్రంలోని సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం నాట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు సైతం ఇలాంటి సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా నాట్స్ విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తొర్రేడు గ్రామంలో గోపి, వెంకటానగర్‌లో దేవదాసు చినబాబు లకు కేటాయించిన కిరాణా దుకాణాలకు నాట్స్ ఒక్కొక్కరికి రూ. 1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ రెండు దుకాణాలను కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ, సాయి గంగుల చేతుల మీదుగా ప్రారంభించారు.

వెన్నెముకకు గాయాలై మంచానికే లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన బాధితులకు హోప్ 4 స్పందన ప్రతి నెలా అందిస్తున్న మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి కూడా నాట్స్ అండగా నిలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు. ఇందులో యూరినల్ బ్యాగులు, డైపర్లు, క్యాథిటర్లు, కాటన్ రోల్స్, బెటాడిన్, డెటాల్, గ్లౌజులు తదితర 13 రకాల అత్యవసర వస్తువులు ఉన్నాయి.

అలాగే, అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో శాశ్వత వసతి గృహాల ఏర్పాటుకు సైతం నాట్స్ తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ హోప్ 4 స్పందన ఆంధ్ర–తెలంగాణ కో-ఆర్డినేటర్ డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో నిర్వహిస్తున్నారు.

నిడదవోలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మి, దయ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ మంచి పనులకు విశేషంగా సహకరిస్తున్న ప్రవాస భారతీయులకు నాట్స్ నాయకత్వం ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.