
మన ఆహారంలో బియ్యం, గోధుమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఆరోగ్యపరంగా వీటి కంటే మిల్లెట్స్ ఎన్నో రెట్లు మంచివని. సైంటిఫిక్ అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయని అంటున్నారు. ఇంకా బియ్యం, గోధుమల వాడకాన్ని తగ్గించి లేదా ఇంకా పూర్తిగా మానేసి, మిల్లెట్స్ వినియోగాన్ని పెంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.

జొన్నలు : జొన్నలు సమతుల్య పోషకాలకు ప్రసిద్ధి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 53. బియ్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. జొన్నలు నెమ్మదిగా అరిగి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమంగా విడుదల చేస్తాయి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్, ప్రొటీన్ రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి. మధుమేహ నియంత్రణకు జొన్నలు ఉత్తమమైనవి.

రాగులు : మిల్లెట్స్‌లో అత్యల్ప క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు రాగుల్లో ఉంటాయి. 100 గ్రాముల రాగుల్లో 321 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. రాగులు దేనికి ప్రసిద్ధి అంటే కాల్షియం. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఎముకల పుష్టికి, కాల్షియం లోపాన్ని నివారించడానికి రాగులు, రాగి రవ్వ, రాగి పిండి చాలా మంచివి.

కొర్రలు: కొర్రలు ప్రొటీన్‌కు నంబర్ వన్. 100 గ్రాముల కొర్రల్లో 12.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది, ఇది మిగతావాటి కంటే చాలా ఎక్కువ. రోజుకు రెండు పూటలా కొర్ర అన్నం తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌లో సగానికి సగం సులభంగా లభిస్తుంది. పూర్వం ప్రోటీన్ లోపాలు తక్కువగా ఉండటానికి కొర్రల వాడకమే కారణం.

సజ్జలు: పూర్వం రోజుల్లో సజ్జలు బలానికి ప్రసిద్ధి. ధాన్యాలలోకెల్లా అత్యధిక బలం సజ్జల్లోనే ఉంటుంది. ఇందులో కొవ్వు పదార్థం (మంచి కొవ్వు) రెండు మూడు గ్రాములు ఎక్కువగా ఉండటం వల్ల 100 గ్రాముల సజ్జలు 360 కిలో క్యాలరీల శక్తిని అందిస్తాయి. రాగుల కంటే ఎక్కువ శక్తివంతమైనవి. సజ్జప్పాలు రుచిగా ఉండటానికి కూడా ఇదే కారణం.