
ఎవరైనా తమ జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి చాలా మంచి వారై ఉండాలని కోరుకుంటారు. వారితో కలిసి సంతోషంగా జీవించాలని అనుకుంటున్నారు. వివాహ జీవితం సుఖంగా, ప్రేమతో, ఆర్థిక భద్రతతో సాగాలని కోరుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన పురుషులు సహజంగానే విధేయత, ప్రేమ, బాధ్యతతో కూడిన జీవిత భాగస్వాములుగా పేరు తెచ్చుకుంటారు. తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారికి ఎలాంటి లోటు రానీయకుండా సంతోషంగా ఉంచుతారు. తమ భార్యల జీవితాల్లో అదృష్టాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే ఈ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి.. వృషభ రాశి పురుషులు అచంచలమైన విధేయతకు ప్రతీక. పట్టుదల, కృషి వీరి బలాలు. ప్రేమ, శృంగారానికి అధిపతి అయిన శుక్రుడు పాలించడం వల్ల వీరు విలాసవంతమైన జీవితం వైపు సహజంగానే ఆకర్షితులవుతారు. వారి సహనం, సానుభూతి భార్యకు భద్రతాభావాన్ని ఇస్తాయి. కుటుంబ జీవితంలో స్థిరత్వం, సౌకర్యం, ఆర్థిక భద్రత కల్పించడంలో వీరు ముందుంటారు. వృషభ రాశి పురుషుడి భాగస్వామిగా ఉండటం అంటే ప్రశాంతమైన, విలాసవంతమైన జీవితం పొందడమే.

సింహ రాశి.. ఆత్మవిశ్వాసానికి మరో పేరు సింహ రాశి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు వీరిని పాలిస్తాడు. సింహరాశి పురుషులు తమ భార్యల జీవితాల్లో ఉత్సాహం, ఆనందం, ప్రేమను నింపుతారు. వారు తమ భాగస్వామిని రాణిలా చూసుకోవడంలో వెనుకాడరు. బహుమతులు ఇవ్వడం, విలాసవంతమైన జీవనశైలి అందించడం వీరికి ఇష్టం. వారి సామాజిక ప్రతిష్ఠ, సంపద తరచూ భార్యల స్థాయిని కూడా పెంచుతుంది.

తులా రాశి.. శుక్రుడు పాలించే తులా రాశి పురుషులు సహజంగానే ప్రేమికులు, గొప్ప దౌత్యవేత్తలు. సంబంధాల్లో న్యాయం, సమానత్వం వీరి ముఖ్య లక్షణాలు. వారు భార్యతో స్నేహపూర్వకంగా, అర్థం చేసుకునే విధంగా వ్యవహరిస్తారు. వారి బహిరంగ స్వభావం కుటుంబ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. ప్రేమను సజీవంగా ఉంచడంలో వీరు నిపుణులు.

వృశ్చిక రాశి.. యుద్ధ గ్రహమైన కుజుడు పాలించే వృశ్చిక రాశి పురుషులు తీవ్రమైన ప్రేమ, గాఢమైన నిబద్ధతకు ప్రసిద్ధి. ఒకసారి ప్రేమలో పడితే జీవితాంతం అదే నిబద్ధతను కొనసాగిస్తారు. వారు తమ భాగస్వామిని మోసం చేయాలని ఊహించరు కూడా. భార్య వ్యక్తిగత వృద్ధి, అదృష్టం కోసం ప్రోత్సహిస్తారు. వారి ఉద్వేగభరితమైన ప్రేమ వివాహ జీవితాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

జ్యోతిష్య సూచన.. వివాహ జీవితంలో ప్రేమ, నమ్మకం, భద్రత కీలకం. ఈ రాశులకు చెందిన పురుషులు సహజంగానే ఈ లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు. అయితే పరస్పర అవగాహన, గౌరవం ఉంటే ఏ రాశి అయినా సుఖవంతమైన దాంపత్య జీవితాన్ని నిర్మించుకోవచ్చు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)