
కావలసిన పదార్థాలు: 1 మీడియం కప్పు రాత్రి మిగిలిన అన్నం, పొడి బియ్యప్పిండి, 1 పచ్చిమిరపకాయ, రుచికి తగినంత ఉప్పు. గమనిక: ఇందులో నీరు, వంటనూనె ఏమాత్రం వాడాల్సిన అవసరం లేదు. తయారీ విధానం: మిక్సీ జార్‌లోకి 1 మీడియం కప్పు మిగిలిన అన్నాన్ని తీసుకోవాలి. ఇందులో 1 పచ్చిమిరపకాయను వేయాలి. నీళ్లు చుక్క కూడా పోయకుండా.. అన్నం మెతుకులు, పచ్చిమిర్చి కనిపించకుండా మెత్తటి ముద్దలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

ప్లేట్లోని అన్నం ముద్దపై 1 కప్పు పొడి బియ్యప్పిండి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నీళ్లు గానీ, నూనె గానీ అస్సలు పోయకుండా.. కేవలం అన్నం ముద్దలోని తేమతోనే చేత్తో పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండి జారుగా కాకుండా చేత్తో పట్టుకుంటే కాస్త గట్టిగా ఉండే డో లాగా మారుతుంది. కలిపిన పిండి నుండి చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలను చేసుకోవాలి.

చపాతీ పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లాలి. పిండి ముద్దను ఉంచి పైన కూడా కొద్దిగా పొడిపిండి చల్లుతూ చపాతీ కర్రతో పల్చగా రోటీలా రోల్ చేసుకోవాలి. రోటీ గుండ్రంగా, అందంగా రావడం కోసం ఒక పదునైన అంచులున్న గిన్నెను తీసుకుని రోటీపై బోర్లించి గట్టిగా నొక్కాలి. అదనపు పిండిని తీసేసి.. రౌండ్‌గా వచ్చిన రోటీలను ప్లేట్లోకి తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.

స్టవ్‌పై ఇనుప పెనం లేదా దోశ పెనం పెట్టి వేడిచేయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత రోటీని వేయాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత వెంటనే అట్లకాడతో రెండో వైపుకు తిప్పుకోవాలి. మంటను మీడియం-హై ఫ్లేమ్‌లో ఉంచి అట్లకాడతో పైనుంచి తేలికగా ఒత్తితే.. రోటీ క్షణాల్లో తెల్లటి పూరీలాగా నిండుగా పొంగుతుంది.

రెండు వైపులా మృదువుగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే నూనె లేని 'మిగిలిన అన్నం బియ్యప్పిండి రోటీలు' సిద్ధం! నాలుగు వేళ్లతో నలిపితే దూదిలా మెత్తగా ఉంటూ.. టమోటా పచ్చడి, ఆవకాయ లేదా ఏదైనా కూరతో నంజుకుని తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతూ ఎంతో కమ్మటి అనుభూతినిస్తుంది!