
కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి తరిగిన రెండు కట్టల తాజా కొత్తిమీర, అర చెక్క - సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, 10 నుండి 15 పచ్చిమిరపకాయలు. ఒక చిన్న రెబ్బల చింతపండు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు దినుసులు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ మరియు తాలింపుకు సరిపడా నూనె.

తయారీ విధానం: రెండు కట్టల తాజా కొత్తిమీరను తీసుకుని వేర్లను కట్ చేసి, ఇసుక ఏమీ లేకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తడి ఆరబెట్టి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్ వెలిగించి కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక చిన్న రెబ్బ చింతపండు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి చిన్న మంటపై మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

ఇప్పుడు అదే కడాయిలో అదనంగా నూనె వేయనవసరం లేకుండా, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి పచ్చివాసన పోయేలా రెండు నిమిషాలు మగ్గించి చల్లారనివ్వాలి. ముందుగా మిక్సీ జార్‌లో వేయించి చల్లార్చుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత అందులోనే మగ్గించిన కొత్తిమీరను కూడా వేసి నీళ్లు ఎక్కువగా పోయకుండా ఒకటి రెండు సార్లు పల్స్ మోడ్‌లో రోటి పచ్చడిలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

మళ్లీ చిన్న కడాయి పెట్టి ఒకటిన్నర స్పూన్ నూనె వేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ పొడి వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించి పచ్చడిలో కలపాలి. అంతే, నోరూరించే కొత్తిమీర కొబ్బరి పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తిన్నా, లేదా ఇడ్లీ, దోశ, చపాతీలతో నంజుకున్నా ప్రతి ముద్దా అమృతంలా అనిపిస్తుంది!