
కావాల్సిన పదార్థాలు: పెసలు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి , నూనె (వేయించడానికి), మినపపప్పు , బియ్యం, పంచదార , యాలకుల పొడిని తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక కడాయి పెట్టుకోవాలి. ఒక గ్లాసు పెసలను తీసుకుని కడాయిలో వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా వేయించుకోవాలి. పెసలు సమానంగా వేగడానికి తరచుగా కలుపుతూ ఉండాలి. ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చాలి. చల్లారిన పెసలను ఒక గిన్నెలోకి తీసుకుని, మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత, శుభ్రం చేసిన పెసలను తగినంత నీరు పోసి కుక్కర్లో పెట్టి, నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత, మెత్తగా అయిన పెసలను ఒక జాలిలో వేసి నీరంతా పోయేలా పక్కన పెట్టుకుని చల్లార్చాలి.

పెసలు చల్లారే లోపు, బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. నాలుగు నుంచి ఐదు చిన్న చతురస్రాకారపు బెల్లం క్యూబులను తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి, ఒక పెద్ద గిన్నె పెట్టుకుని, కొద్దిగా నీళ్లు పోసి, తరిగిన బెల్లాన్ని అందులో వేయాలి. బెల్లం మొత్తం కరిగే వరకు దీనిని కలుపుతూ ఉండాలి. బెల్లం కరుగుతున్న సమయంలో, ఒక చిన్న మిక్సీ జార్లో కొద్దిగా పంచదార, పది నుంచి పన్నెండు యాలకులు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.

బెల్లం పాకం బాగా మరుగుతున్నప్పుడు, ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న పెసల పొడిని కొద్దికొద్దిగా పాకంలో వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పెసల పొడి, బెల్లం పాకం పూర్తిగా కలిసిపోయి, తడిదనం లేకుండా గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న యాలకుల పొడిని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పూర్ణాన్ని చల్లారనివ్వాలి.

పూర్ణం మిశ్రమం చల్లారిన తర్వాత, చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రటి ఉండలుగా చేసుకోవాలి. కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర స్వామి వ్రతంలో మూడు పెద్ద బూరెలు అవసరం కాబట్టి, కొన్ని ఉండలను పెద్దవిగా, మిగిలినవి చిన్నవిగా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఉండలను ఒక పళ్లెంలో పెట్టుకోవాలి.

ఒక గ్లాసు మినపపప్పుకు రెండున్నర నుంచి మూడు గ్లాసుల బియ్యం కలిపి కనీసం ఒకటి నుంచి ఒకటిన్నర గంట పాటు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత, గ్రైండర్లో వేసి మరీ పలుచగా కాకుండా, కొద్దిగా చిక్కగా, మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా చిక్కగా రుబ్బుకోవడం వల్ల బూరెలు కరకరలాడుతూ, మృదువుగా వస్తాయి. ఈ తోపు రుబ్బును ఒక గిన్నెలోకి తీసుకుని, కొద్దిగా బెల్లం పొడి కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటికి తీయదనం వస్తుంది. చివరగా, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని, బూరెలు వేయించడానికి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడైన తర్వాత, సిద్ధం చేసుకున్న పెసల ఉండలను ఒక్కొక్కటిగా తోపులో ముంచి, జాగ్రత్తగా నూనెలో వేయాలి. స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, బూరెలు బంగారు రంగులోకి మారి, లోపల కూడా బాగా ఉడికే వరకు వేయించుకోవాలి.