
ముందుగా పావు కేజీ నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, ఇక్కడ చూపించిన విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. నేతి బీరకాయలు లేతవి తీసుకోవడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది, త్వరగా మగ్గుతుంది. ఈ బీరకాయలకు తొక్క తీయాల్సిన అవసరం లేదు. ఒక ప్యాన్‌ను వేడి చేసి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్‌గా వేయించుకోండి. కొంతమంది నువ్వులు వేస్తారు.

ధనియాలు వేగిన తర్వాత, తుంచుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు వేయండి. మంటను తక్కువ మంటలో పెట్టి, బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు సుమారు రెండు నిమిషాలు వేయించండి.వేగిన తర్వాత, కొద్దిగా చింతపండు, బాగా పండిన రెండు టమాటా ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇవన్నీ బాగా కలిసేలా కలిపి, మూత పెట్టి తక్కువ మంటపై ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి.

నేతి బీరకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి త్వరగా మగ్గుతాయి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి మగ్గించండి. నాలుగు లేదా ఐదు నిమిషాల్లో ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. మరీ పొడిగా అయ్యేంత వరకు వేయించకుండా, కాస్త తేమగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఒకవేళ రోలు ఉంటే, రోట్లో దంచుకుంటే పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది.

మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత, ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసి మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా, పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. నాలుగైదు సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేయడం వల్ల అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఒక ప్యాన్‌లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి.

ఆవాలు వేగిన తర్వాత, రెండు లేదా మూడు ఎండుమిరపకాయలను తుంచి వేసి, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించండి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఈ పోపులో వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. కొంతమంది ఇంగువ ఇష్టపడతారు, కావాలంటే కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చు. అంతే, నోరూరించే నేతి బీరకాయ పచ్చడి రెడీ.