
కావలసిన పదార్థాలు: 2 కప్పుల ఇడ్లీ రవ్వ, 1 కప్పు నిండుగా చేత్తో అదిమి పైకి వచ్చేలా కొలిచిన మిగిలిన అన్నం, 1½ కప్పుల పుల్లటి మజ్జిగ , రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ వంట సోడా, ఇడ్లీ ప్లేట్లకు పూయడానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె , రవ్వ నానబెట్టడానికి & పిండి కలుపుకోవడానికి తగినన్ని నీళ్లు

తయారీ విధానం: ఒక గిన్నెలో 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి చేత్తో రుద్దుతూ రెండు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన నీటిని వంపేసి.. తిరిగి మంచి నీళ్లు పోసి కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇన్స్టంట్ ఇడ్లీలు కాబట్టి రవ్వ గంట పాటు నానితేనే మెత్తగా వస్తాయి.మిక్సీ జార్లో 1 కప్పు నిండుగా ఉన్న మిగిలిన అన్నాన్ని వేయాలి. ఇందులో ఒకటిన్నర కప్పుల పుల్లటి మజ్జిగ పోయాలి. బరక ఏమాత్రం లేకుండా చాలా నునుపైన మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవచ్చు.

గంట తర్వాత నానిన ఇడ్లీ రవ్వలోని నీటిని వంపేసి.. రెండు చేతుల మధ్య రవ్వను ఉంచి నీరు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి, మిక్సీ పట్టిన అన్నం మిశ్రమంలో వేయాలి. రవ్వ మరియు అన్నం పేస్ట్ సమంగా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ వంటసోడా వేయాలి. ఇన్స్టంట్ ఇడ్లీ కాబట్టి పిండిని చేతితో కాసేపు ఎక్కువ సమయం గాలి బుడగలు వచ్చేలా బాగా బీట్ చేస్తూ కలపాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించి ఇడ్లీ పిండి జారుడు కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి.

ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాయాలి. గరిటెతో పిండిని ఇడ్లీ గుంటల్లో నింపుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడిచేసి, ఇడ్లీ స్టాండ్‌ను లోపల ఉంచి మూతపెట్టాలి. మొదట లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఉంచి.. ఆ తర్వాత మీడియం-హై ఫ్లేమ్‌లో 8 నుండి 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి చల్లటి నీళ్ల తడి చేసుకున్న స్పూన్‌తో ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకోవాలి.అంతే, నోరూరించే దూదిలాంటి 'ఇన్స్టంట్ ఇడ్లీలు' సిద్ధం! కమ్మని పల్లీ చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్‌తో వేడివేడిగా తింటుంటే రాత్రి మిగిలిన అన్నంతో చేశారంటే ఎవరూ నమ్మలేనంత సాఫ్ట్‌గా, రుచిగా ఉంటాయి!