
కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి లేదా గోధుమపిండి, అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పంచదార, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, అర టీస్పూన్ యాలకుల పొడి, పావు కప్పు స్వచ్ఛమైన నెయ్యి , పిండి కలపడానికి తగినన్ని పాలు లేదా నీళ్లు, తీపిని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె

తయారీ విధానం: ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు మైదా పిండి, అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పంచదార, రెండు స్పూన్ల తెల్ల నువ్వులు, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు కరిగించిన నెయ్యిని పోయాలి. చేతివేళ్లతో పిండినంతటినీ నలుపుతూ నెయ్యి పిండిలోని ప్రతి రేణువుకూ పట్టేలా బాగా కలపాలి. పిండిని గుప్పెట్లో పట్టుకుంటే ముద్దలా నిలబడే 'మోయన్' పదం రావాలి.

ఇప్పుడు కొద్దికొద్దిగా పాలను లేదా నీళ్లను చిలకరిస్తూ పూరీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలా ముద్దలా కలుపుకోవాలి. పంచదార కరిగి పిండి జారుడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నీటిని చాలా తక్కువగా వాడాలి. పిండిని 10 నుండి 15 నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచితే రవ్వ నానుతుంది.

నానిన పిండిని మరోసారి బాగా ఒత్తి చపాతీ పీటపై ఉంచాలి. రోలింగ్ పిన్‌తో మరీ పలుచగా కాకుండా, అర అంగుళం మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చాకుతో లేదా పిజ్జా కట్టర్‌తో డైమండ్ షేప్‌లో లేదా దీర్ఘచతురస్రాకారంలో చిన్న చిన్న ఖజూర్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఖజూర్ ముక్కలను వేయాలి.

హై ఫ్లేమ్‌పై వేయిస్తే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి; కాబట్టి చిన్న మంటపైనే నెమ్మదిగా రెండు వైపులా ఎర్రటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. నూనెలో నుంచి తీసినప్పుడు ఇవి కాస్త మెత్తగా ఉన్నట్లు అనిపించినా.. పూర్తిగా చల్లారిన తర్వాత ఎంతో కరకరలాడుతూ, లోపల బిస్కెట్‌లా గుల్లగా తయారవుతాయి. అంతే, నోరూరించే హైదరాబాదీ స్పెషల్ 'ఖజూర్' స్వీట్ సిద్ధ! గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు తాజాగా, క్రిస్పీగా ఉంటాయి