
జీర్ణక్రియ: బొప్పాయి గింజల్లో పాపైన్, ఖైమోపాపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేస్తాయి. తద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అంతేకాకుండా పేగుల్లో ఉండే హానికరమైన నులిపురుగులు, పరాన్నజీవులను చంపే గుణం వీటికి ఉంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

కాలేయానికి సంజీవని: నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఫ్యాటీ లివర్ లేదా లివర్ సిర్రోసిస్ బారిన పడుతున్నారు. బొప్పాయి గింజలు కాలేయాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ కొద్దిగా బొప్పాయి గింజల పొడిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే, కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి, దాని పనితీరు మెరుగుపడుతుంది.

క్యాన్సర్: బొప్పాయి గింజల్లో ఉండే ఎసిటోజెనిన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల నివారణలో ఇవి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

శరీరంలోని వ్యర్థాలను వడపోసే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయి గింజలు మేలు చేస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యల నుంచి రక్షించడమే కాకుండా ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి మూత్రపిండాల కణజాలాన్ని దృఢంగా మారుస్తాయి. అదేవిధంగా కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి బొప్పాయి గింజలు ఒక సహజ ఔషధం. వీటిలో ఉండే విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ శరీరంలో కలిగే మంటను, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎలా వాడాలి: బొప్పాయి గింజలు కొద్దిగా చేదుగా, మిరియాల వంటి ఘాటును కలిగి ఉంటాయి.ఈ గింజలను ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని సలాడ్లు, స్మూతీలు లేదా సూప్‌లలో అర టీస్పూన్ చొప్పున కలుపుకోవచ్చు. నల్ల మిరియాలకు బదులుగా ఈ ఎండిన గింజలను గ్రైండ్ చేసి వంటల్లో వాడుకోవచ్చు. గింజల చేదును తగ్గించడానికి కొద్దిగా తేనెతో కలిపి నేరుగా కూడా తీసుకోవచ్చు.

ప్రయోజనాలు ఉన్నాయని అతిగా వాడటం ప్రమాదకరం. రోజుకు 5 నుండి 8 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. బొప్పాయి గింజల్లో ఉండే కొన్ని పదార్థాలు గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉన్నందున, గర్భిణీలు వీటికి దూరంగా ఉండటం మంచిది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఇవి పురుషులలో శుక్రకణాల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు జాగ్రత్తగా ఉండాలి.