వెల్లుల్లి.. ప్రతి వంటగదిలో ఉంటుంది. వెల్లుల్లిలో ఔషధ గుణాలతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.. అందుకే చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లిని పచ్చిగా తింటారు. అయితే.. వెల్లుల్లి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఇది బరువు తగ్గడానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుందని, బెల్లీ ఫ్యాట్ సమస్యను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. కావున.. బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి: వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.. అందుకే ఉదయాన్నే వెల్లుల్లిపాయలు తిన్నా.. లేదా దాని రసం కొంచెం తాగినా ఆరోగ్యంగా ఉంటారు.
గుండె ఆరోగ్యం: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి: వెల్లుల్లిలోని కొన్ని లక్షణాలు చెడు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే గార్లిక్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం: వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మంపై ముడతలను నివారిస్తుంది. ఇంకా అలెర్జీలను దరిచేరనివ్వకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి: ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి రెబ్బలను రెండింటిని తినవచ్చు. లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, వెల్లుల్లి కలిపిన నీటిని తాగవచ్చు. ఇలా చేయడం ద్వారా కాలక్రమేణా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు.
వెల్లుల్లి వేడి స్వభావం కలిగి ఉంటుంది.. ఇది ఫ్యాట్ బర్నర్ గా పనిచేస్తుంది.. అయితే.. వీటిని ఆహారం, సూప్ లాంటి వాటిలో ఉపయోగించి తీసుకోవచ్చు.. (గమనిక: ఇది కేవలం మీ అవగాహన కోసమే.. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.)