
ఆకు కూరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని వారంలో మూడు సార్లు తింటే, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది పాలకూర, తోట కూర తింటారు. అయితే, వాటితో పాటు మెంతి కూర హెల్త్ కి మంచిది.

మెంతికూరలో ఐరన్, ఫైబర్ తో పాటు పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే, ఈ మెంతి కూరను ఎక్కువగా పరాఠాల్లో తింటారు. అయితే, ఫ్రెష్ మెంతికూర త్వరగా పాడవుతుంది. దీనిని నిల్వ చేసే పద్దతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మెంతి కూరలను తాజాగా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్ బెటర్. ముందుగా మెంతి ఆకులను తీసుకుని కడగకుండా ఒక క్లాత్ లో కానీ, టిష్యూలో కానీ పెట్టి చుట్టాలి. ఆ తర్వాత గాలి చొరబడని పాలిథిన్ బ్యాగ్‌లో నిల్వ చేయాలి.

మెంతికూరను ఏడాది పాటు నిల్వ చేయొచ్చు. ఎలా అంటే దానిని ఎండలో బాగా ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. దీని కోసం మెంతి ఆకులను తీసుకుని మంచి నీటితో బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ఒక క్లాత్ పై పరిచి ఆకులు ఆరిపోయే వరకు ఉంచాలి.

ఈ మెంతి ఆకులు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీ చేతులతో తీసుకుని వాటిని పొడి చేసి ఒక చిన్న జాడిలో నిల్వ చేయాలి. ఈ ఎండిన మెంతికూర ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. పప్పు , చట్నీలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.