
పాలను సరైన ఉష్ణోగ్రతకు వేడి చేసి చల్లారనివ్వాలి: ముందుగా మందపాటి అడుగు ఉన్న శుభ్రమైన గిన్నెలో అర లీటరు పాశ్చరైజ్డ్ లేదా క్రీమీ పెరుగు కోసం ఫుల్-క్రీమ్ పాలను తీసుకోండి. అడుగు అంటకుండా మధ్యస్థ మంట మీద కలుపుతూ సుమారు 82 నుండి 85 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగు ఆకృతి చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మంట ఆర్పి, పాలను చల్లారనివ్వాలి.

తోడు వేయడానికి సరైన సమయం ఏది?: చలికాలంలో నిమిషాలు లెక్కించడం కంటే పాల ఉష్ణోగ్రతను గమనించడం ముఖ్యం. పాలు వేడిగా ఉన్నప్పుడే తోడు వేయకూడదు. కిచెన్ థర్మామీటర్ ఉంటే పాల ఉష్ణోగ్రత 42 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వద్దకు వచ్చినప్పుడు తోడు వేయాలి. థర్మామీటర్ లేకపోతే, వేలికి గోరువెచ్చగా తగిలే స్థితికి పాలు రావాలి.

తోడు ఎలా కలపాలి?: అర లీటరు పాలకు ఒక టేబుల్ స్పూన్ తాజా సాదా పెరుగును స్టార్టర్‌గా తీసుకోండి. పాత పెరుగు వాడితే పెరుగు పుల్లగా మారుతుంది. తోడు పెరుగును నేరుగా పాలల్లో వేయకుండా, ఒక చిన్న గిన్నెలో వేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పాల గిన్నెలో పోసి నెమ్మదిగా కలపాలి. దీనివల్ల తోడు పాలంతటా సమానంగా విస్తరించి పెరుగు గడ్డలా కడుతుంది.

పాత్రను వెచ్చగా ఉంచే పద్ధతి: తోడు వేసిన పాలను శుభ్రమైన, పొడి పాత్రలో పోసి మూత పెట్టండి. చలికాలంలో కిటికీల పక్కన లేదా చల్లని గ్రానైట్ కౌంటర్‌పై పెడితే పాలు త్వరగా చల్లబడతాయి. అందుకే పాత్ర చుట్టూ పొడి, మందపాటి టవల్ చుట్టి వెచ్చని ప్రదేశంలో పెట్టండి. గది మరీ చల్లగా ఉంటే, ఒక ఇన్సులేటెడ్ బాక్స్‌లో 43 డిగ్రీల సెల్సియస్ గోరువెచ్చని నీళ్లు పోసి, అందులో ఈ పాల పాత్రను ఉంచండి.

గడ్డకట్టిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టండి: సాధారణంగా పెరుగు తోడుకోవడానికి 6 నుండి 10 గంటల సమయం పడుతుంది. మధ్యమధ్యలో మూత తీసి చూడటం లేదా గిన్నెను కదపడం చేయవద్దు. 6 గంటల తర్వాత పై పొర గడ్డకట్టినట్లు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా మూత పెట్టి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిజ్‌లో పెట్టేయాలి. రాత్రంతా బయట ఉంచితే పెరుగు పుల్లగా మారుతుంది. అయితే పగటిపూట తోడు పెట్టి, గడ్డకట్టగానే ఫ్రిజ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. ఫ్రిజ్‌లో కొన్ని గంటలు ఉంచడం వల్ల పెరుగు మరింత గట్టిగా, క్రీమీగా మారుతుంది.