
ఆకారాన్ని బట్టి ఎంచుకోండి: మార్కెట్లో లభించే కొబ్బరి బొండాలలో ఆకారాల వారీగా తేడాలు ఉంటాయి. కొన్ని పొడవుగా, మరికొన్ని గుండ్రంగా ఉంటాయి. సాధారణంగా పొడవాటి ఆకారంలో ఉండే బొండాల్లో నీరు తక్కువగా ఉండి, పీచు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదే గుండ్రంగా, సమాన పరిమాణంలో ఉండే కొబ్బరి బొండాలలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొనేటప్పుడు గుండ్రటి బొండాలను ఎంచుకోవడం ఉత్తమం.

బరువు, సౌండ్ :కొబ్బరి బొండాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది పరిమాణానికి తగ్గట్టు కాస్త బరువుగా అనిపించాలి. సమాన పరిమాణంలో ఉన్న రెండు మూడు బొండాలను చేత్తో పట్టుకుని, ఎక్కువ బరువుగా అనిపించిన దాన్ని ఎంచుకోవాలి. ఎండిపోయినట్లు ఉండి తేలికగా అనిపిస్తే అందులో నీళ్లు లేవని అర్థం. అలాగే బొండాన్ని చెవి దగ్గరకు చేర్చి కాస్త అటూ ఇటూ ఊపి చూడాలి. లోపల నీళ్లు బాగా గలగలమంటూ జోరుగా కదులుతున్న శబ్దం వస్తే అందులో ఖాళీ స్థలం ఎక్కువ ఉండి నీరు తక్కువగా ఉందని అర్థం. అలా కాకుండా నీటి శబ్దం తక్కువగా వస్తుంటే లోపల నీరు నిండుగా ఉందని గుర్తించాలి.

పరిమాణం కాదు.. రంగు ముఖ్యం: చాలామంది పెద్ద సైజు బొండాలలోనే ఎక్కువ నీళ్లు ఉంటాయని భావిస్తారు, కానీ అది నిజం కాదు. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఉండే మీడియం సైజు బొండాల్లోనే తియ్యటి నీరు పుష్కలంగా లభిస్తుంది. అలాగే రంగు విషయంలోనూ జాగ్రత్త వహించాలి. పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా ఉంటే ఆ బొండం ముదిరిపోయిందని, లోపల గట్టి కొబ్బరి ఏర్పడి నీళ్లు తగ్గిపోయాయని అర్థం. లేత ఆకుపచ్చ రంగులో, తాజాగా మెరుస్తూ ఉండే బొండాలు లేతగా ఉండి ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి.

కొబ్బరి కావాలా? నీళ్లు మాత్రమే కావాలా?: కొందరు కేవలం తీపి నీటిని మాత్రమే ఇష్టపడితే, మరికొందరు లోపల ఉండే పలుచని లేత కొబ్బరి తినడానికి ఇష్టపడతారు. పూర్తిగా లేత బొండాల్లో నీరు అధికంగా ఉండి మలై ఉండదు. కొద్దిగా ముదిరిన వాటిలో తియ్యటి కొబ్బరి గుజ్జు ఏర్పడుతుంది. మీ ప్రాధాన్యతను బట్టి పచ్చగా ఉండే లేతదాన్ని లేదా కాస్త గట్టిపడిన బొండాన్ని ఎంచుకోవచ్చు.

కొట్టిన వెంటనే తాగేయండి: కొబ్బరి బొండాన్ని కొట్టించిన వెంటనే తాగడం అత్యంత ముఖ్యం. ఎక్కువసేపు గాలి తగిలేలా అలాగే ఉంచితే అందులోని సహజ లవణాలు, పోషక విలువలు నశించిపోయే ప్రమాదం ఉంది. తాజా కొబ్బరి నీళ్లను నేరుగా తాగినప్పుడే శరీరానికి సంపూర్ణ హైడ్రేషన్, ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.