
ఓనం పండుగ వచ్చేస్తుంది. కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే, అలాగే కేరళలోని అతి పెద్ద రాష్ట్ర పండుగ ఇది. ఇక ఈ సంవత్సరం ఓనం పండుగ ఆగస్టు 16న ప్రారంభం అయ్యింది. దీనిని ఆగస్టు 27 వరకు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో తిరువోణం ఆగస్టు 26 చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఓనం పండుగ సమయంలో అక్కడి వారు ఓ స్పెషల్ కర్రీ చేస్తారు. అది ఏంటో చూద్దాం.

ఓనం పండుగ సమయంలో ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం అయిన ఓలన్ కర్రీ వండటం తప్పనిసరి. ఈ స్పెషల్ రిసిపీ పండుగ ప్రత్యేకమైనది. అయితే దీనిని బూడిద గుమ్మడికాయతో తయారు చేస్తారు. కాగా ఈ స్పెషల్ రిసిపీని ఇంటిలో చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : బూడిద గుమ్మడికాయ, పచ్చి బఠానీలు, పచ్చి మిరపకాయలు, కొబ్బరి పాలు, చిక్కని కొబ్బరి పాలు, కరివేపాకు, కొబ్బరి నూనె, తగినంత ఉప్పు. అంతే ఈ పదార్థాలతో చాలా సులభంగా ఓనం సధ్యలో తప్పనిసరిగా ఉండే ఈ రిసిపీ తయారు చేయవచ్చును.

తయారీ విధానంలోకి వెళితే..ముందుగా బూడిద గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చి మిర్చి కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. అందులో కొబ్బరి పాలు పోయాలి. తర్వాత అందులోనే గుమ్మడికాయ ముక్కలు, పచ్చి మిర్చీ వేయాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. గుమ్మడికాయ ముక్కలు పాలల్లోనే బాగా కాస్త మొత్తగా ఉడికేలా చూసుకోవాలి. గుమ్మడికాయలు ఉడికిన తర్వాత అందులో అలచందలు, బఠానీలు చిక్కని కొబ్బరి పాలు ఉప్పు వేసి మరో పదినిమిషాలు ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికి కాస్త చిక్కగా వచ్చిన తర్వాత పైన కొబ్బరి నూనె, కరివేపాకు వేసుకోవాలి.అంతే ఓలన్ కర్రీ రెడీ.