
సాధారణంగా రిఫ్రిజిరేటర్లు నడుస్తున్నప్పుడు ఒక చిన్న సౌండ్ చేస్తాయి. అలా కాకుండా మీ ఫ్రిజ్ నుండి అసాధారణమైన సౌండ్ వస్తే లోపల ఏదో సాంకేతిక సమస్య ఉందని అర్థం. అలాగే ఫ్రిజ్‌లో కూలింగ్ స్థిరంగా లేకపోవడం మరొక ముఖ్య సంకేతం. సడెన్‌గా విద్యుత్ బిల్లు విపరీతంగా పెరగడం కూడా ఫ్రిజ్ లోపల సమస్య ఉందనడానికి బలమైన సంకేతం. కంప్రెసర్ లోపం, డోర్ సీల్ విరిగిపోవడం, థర్మోస్టాట్ దెబ్బతినడం లేదా కండెన్సర్ కాయిల్స్ మురికిగా మారడం వల్లనే ఫ్రిజ్‌లు ఎక్కువగా పాడవుతుంటాయి.

లోపలి భాగాన్ని శుభ్రం చేయండి: మీ ఫ్రిజ్‌ను ప్రతి వారం క్లీన్ చేయడం చాలా అవసరం. చాలామంది ఫ్రిజ్‌ను అరుదుగా శుభ్రం చేస్తుంటారు. దీనివల్ల కూరగాయల గ్రేవీలు, సాస్‌లు, చిన్న చిన్న ఆహార కణాలు డోర్ గాస్కెట్‌పై పేరుకుపోతాయి. ఫలితంగా డోర్ సరిగ్గా లాక్ అవ్వక లోపలి చల్లటి గాలి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల ఫ్రిజ్‌ను చల్లబరచడానికి కంప్రెసర్ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. చివరికి ఇది కంప్రెసర్ పాడైపోవడానికి, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడానికి దారితీస్తుంది.

కండెన్సర్ కాయిల్స్ - ఫిల్టర్ల నిర్వహణ: ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్‌ను సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు తప్పకుండా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిపై మురికి, ధూళి పేరుకుపోకుండా ఉంటుంది. ఈ మురికి గాలి ప్రవాహానికి ఆటంకం కలిగించి, యంత్రం పనితీరును దెబ్బతీస్తుంది. అలాగే ఫ్రిజ్‌లో ఉండే అన్ని ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, అవసరమైతే మార్చడం కూడా చాలా అవసరం.

అధిక భారం వేయవద్దు : చాలామంది ఫ్రిజ్ నిండా వస్తువులను కుక్కేస్తుంటారు. అలా ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయడం అస్సలు మంచిది కాదు. అధికంగా లోడ్ చేయడం వల్ల లోపల చల్లటి గాలి ప్రసరణ ఆగిపోయి, కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఫ్రిజ్ జీవితకాలాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

సరైన స్థలాన్ని ఎంచుకోండి: మీరు మీ రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో ఎక్కడ ఉంచుతారనేది కూడా చాలా ముఖ్యం. నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో ఫ్రిజ్‌ను పెట్టకూడదు. అలాగే రిఫ్రిజిరేటర్ చుట్టూ గాలి ధారాళంగా ప్రసరించడానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్ పైభాగంలో వస్తువులను పెట్టకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దాని పనితీరు బాగుంటుంది.