
మనలో చాలా మందికి దుప్పట్లు, దిండు కవర్లు, తువ్వాళ్లు ఉతకడంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం. అవి చూసేందుకు శుభ్రంగా కనిపిస్తాయని తరచూ ఉతకవల్సిన అవసరం లేదని అనుకుంటాము. అయితే, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'టవల్ సూపర్ సెంటర్' నివేదిక ప్రకారం స్నానం చేసిన తర్వాత శరీరం శుభ్రంగా ఉండటం వల్ల టవల్ మురికిగా మారదని చాలా మంది భావిస్తారు. అయితే ఇది వాస్తవం కాదు. తడి టవల్ తో మీ శరీరాన్ని తుడిచినప్పుడు మృత కణాలు దానిలో త్వరగా పేరుకుపోతాయి.

దానితో పాటు శరీరంపై ఉన్న సహజ నూనెలు టవల్‌లోకి శోషించబడతాయి. అందుకే టవల్ పూర్తిగా ఆరిపోవడానికి సమయం పడుతుంది. ఈ తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇది చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, అథ్లెట్స్ ఫుట్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఈ కారణంగా బాత్రూంలో తేమ ఎక్కువగా ఉంటే టవల్‌ను అక్కడ ఆరబెట్టవద్దు. ఎల్లప్పుడూ బహిరంగంగా, ఎండ తగిలే ప్రదేశంలో ఆరబెట్టాలి. మైక్రోఫైబర్ టవల్స్ త్వరగా ఆరిపోతాయి. కాటన్ టవల్స్ ఎక్కువ కాలం తేమను నిలుపుకుంటాయి. కాటన్ టవల్స్ యాంటీ బాక్టీరియల్ అయినప్పటికీ క్రమం తప్పకుండా శుభ్రం చేయడం తప్పనిసరి. ప్రఖ్యాత నిపుణురాలు జెన్నిఫర్ ఆడమ్స్ ప్రకారం తరచుగా ఉతకడం వల్ల తువ్వాళ్లలోని కాటన్ ఫైబర్స్ బలహీనపడి వాటి నీటి శోషణ సామర్థ్యం తగ్గుతుంది.

అందువల్ల మీరు సాధారణంగా ప్రతి 2 నుండి 3 సంవత్సరాలకు ఒకసారి మీ పాత బాత్ టవల్‌ను మార్చి కొత్తది కొనుగోలు చేయాలి. అలాగే మీరు ఉపయోగించే ఏదైనా టవల్‌ను గరిష్టంగా 5 సంవత్సరాలు ఉపయోగించాలి. ఇది మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ప్రతి ఉపయోగం తర్వాత తువ్వాళ్లను శుభ్రం చేయడం అవసరం లేకపోయినా స్నానం తువ్వాళ్లను సాధారణంగా 3 నుంచి 4 సార్లు ఉపయోగించిన తర్వాత ఉతకాలి. అలాగే చేతులు తుడుచుకోవడానికి ఉపయోగించే తువ్వాళ్లను తరచుగా ఉతుకుతూ ఉండాలి.

ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, వారి తువ్వాళ్లను క్రమం తప్పకుండా ఉతకడం మర్చిపోకూడదు. జిమ్‌లో ఉపయోగించే తువ్వాళ్లను కూడా క్రమం తప్పకుండా ఉతకడం మంచిది. మీకు సున్నితమైన చర్మం ఉంటే, ప్రతి ఉపయోగం తర్వాత మీ తువ్వాళ్లను శుబ్రం చేస్తూ ఉండాలి.