
మనం రోజంతా మొబైల్ ఫోన్లు, కీబోర్డులు, తలుపు హ్యాండిల్స్, డబ్బు వంటి ఎన్నో వస్తువులను తాకుతాము. మన కంటికి కనిపించని వేలాది బ్యాక్టీరియా, క్రిములు గోళ్ల కింద చేరుతాయి. వాటిని కొరికినప్పుడు ఆ క్రిములు నేరుగా కడుపులోకి వెళ్లి విరేచనాలు, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తాయి. నిరంతరం గోళ్లు కొరకడం వల్ల దంతాల ఆకారం దెబ్బతినడమే కాకుండా చిగుళ్లు బలహీనపడి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం శారీరక అలవాటు మాత్రమే కాదు.. ఒక మానసిక సంకేతం. మెదడు ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి పనులు చేయిస్తుంది. ఏమీ తోచనప్పుడు కూడా మనసు ఒక సౌకర్యవంతమైన చర్య కోసం గోళ్లను ఆశ్రయిస్తుంది.

ఈ చెడు అలవాటుకు స్వస్తి పలకడం అసాధ్యమేమీ కాదు. గోళ్లు ఎప్పుడూ చిన్నగా, శుభ్రంగా ఉంటే కొరకడానికి అవకాశం ఉండదు. మెడికల్ షాపుల్లో దొరికే చేదుగా ఉండే నెయిల్ ఉత్పత్తులను వాడండి. నోట్లో వేలు పెట్టగానే ఆ చేదు వల్ల అలవాటు గుర్తుకొచ్చి ఆపేస్తారు.

స్ట్రెస్ బాల్స్ లేదా పెన్నులతో ఆడటం ద్వారా చేతులకు పని చెప్పండి. దీంతో గోళ్ల జోలికి వెళ్లకుండా ఉంటారు. ఒత్తిడి వల్ల ఇలా చేస్తుంటే.. కాసేపు ప్రశాంతంగా గాలి పీల్చుకోవడం లేదా సంగీతం వినడం ద్వారా మనసును మళ్లించండి.

గోళ్లు కొరకడం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు.. అది మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్న. చిన్న వయసులోనే ఈ అలవాటును గుర్తిస్తే త్వరగా మానుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.