
Door Sound: రాత్రిపూట గాలికి తలుపు అకస్మాత్తుగా తెరుచుకోవడం లేదా మూసుకోవడం వల్ల వచ్చే శబ్దం దాదాపు అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు రాత్రిపూట గాలికి తలుపు అకస్మాత్తుగా తెరుచుకోవడం లేదా మూసుకోవడం ఇంట్లో భయపడవచ్చు. ఎందుకంటే అటువంటి శబ్దాలు తరచుగా హారర్ సినిమాలలో చిత్రీకరిస్తుంటారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సాధారణ సమస్య. మీ ఇంటి తలుపు కూడా ఇలాంటి శబ్దం చేస్తుంటే, మీరు అదనపు డబ్బు ఖర్చు చేయకుండా సులభమైన ఇంటి చిట్కాలతో దాన్ని సరిచేయవచ్చు.

ఇలాంటి సమస్యలు ముఖ్యంగా వర్షాకాలంలో ప్రత్యేకించి చెక్క తలుపుల విషయంలో సర్వసాధారణం. ఈ తలుపులు తెరవడం, మూయడం వల్ల కలిగే శబ్దాన్ని తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. ఈ పద్ధతులు సమయం లేదా డబ్బు వృధా చేయకుండా సమస్యను పరిష్కరించడానికి మీకు సహాయపడతాయి.

శబ్దాన్ని తగ్గించడానికి సబ్బును వాడండి: శబ్దం చేసే తలుపుల శబ్దాన్ని తగ్గించడానికి సబ్బుతో రుద్దడం ఒక గొప్ప గృహ చికిత్స. సబ్బులోని పదార్థాలు కందెనలా పనిచేసి, తలుపు సులభంగా తెరుచుకోవడానికి, మూసుకోవడానికి సహాయపడతాయి. స్క్రూలు, ఫ్రేమ్ బిగించి ఉన్న తలుపు అంచులపై సబ్బును బాగా రుద్దండి.

ఏదైనా నూనె: తలుపు నుండి వచ్చే శబ్దాన్ని తొలగించడానికి మీరు ఇంట్లో ఉపయోగించే ఏదైనా నూనె సహాయం తీసుకోవచ్చు. మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే దానికి రాయండి, అది తలుపు నుండి వచ్చే గలగల శబ్దాన్ని పూర్తిగా ఆపేస్తుంది. మీ తలుపు కూడా సులభంగా తెరుచుకోవడానికి మూసుకోవడానికి వీలవుతుంది.

పెట్రోలియం జెల్లీ: ఇప్పటి వరకు మీరు పొడి చర్మం లేదా పగిలిన పెదవుల కోసం మాత్రమే పెట్రోలియం జెల్లీని ఉపయోగించి ఉండవచ్చు. శబ్దం చేసే తలుపును సరిచేయడానికి కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చు. మీ వేళ్లతో దీనిని హింజ్ పిన్ లేదా నట్‌కు సులభంగా పూయండి.

టాల్కమ్ పౌడర్ చల్లండి: మీరు టాల్కమ్ పౌడర్ లేదా బేబీ పౌడర్‌ను ఉపయోగించి కూడా శబ్దం చేసే తలుపును సరిచేయవచ్చు. పౌడర్ కణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అందుకే దానిని గరుకైన ఉపరితలంపై పూయడం వల్ల అది నునుపుగా, కందెనలా పనిచేస్తుంది. అందుకే మీ తలుపుపై ఉన్న గ్రీజు అరిగిపోయి ఉంటే మీరు ఈ పౌడర్‌ను జాయింట్లపై చల్లవచ్చు.