
కావలసిన పదార్థాలు: 2 గంటలు నానబెట్టిన 1 కప్పు రేషన్ బియ్యం లేదా సాధారణ బియ్యం, ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 3 కప్పుల చిక్కటి పాలు, ముప్పావు కప్పు తురిమిన బెల్లం, నీళ్లు, స్వచ్ఛమైన నెయ్యి, పావు కప్పు జీడిపప్పు పలుకులు, పావు కప్పు కిస్మిస్

తయారీ విధానం: ఒక పాత్రలో 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తగినన్ని నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర కప్పు నీళ్లు పోసి ఎక్కడా పలుకు లేకుండా చాలా నునుపైన ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై పాన్ పెట్టి ముప్పావు కప్పు తురిమిన బెల్లం, అర కప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తీగ పాకం అవసరం లేదు. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టవ్‌పై పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక పావు కప్పు జీడిపప్పు వేసి లైట్‌గా వేయించాలి. తర్వాత పావు కప్పు కిస్మిస్లు వేసి రెండు మంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

అదే గిన్నెలోని నేతిలోకి సరిగ్గా 3 కప్పుల ఫుల్ క్రీమ్ పాలను పోసి మరిగించాలి. పాలు ఒక పొంగు రాగానే మంటను పూర్తిగా సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం-కొబ్బరి పేస్ట్‌ను కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో అస్సలు ఆపకుండా కలుపుతూ ఉండాలి. మంటను సిమ్ లోనే ఉంచి కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికిస్తే కొద్దిసేపటికే మిశ్రమం పాలన్నింటినీ పీల్చుకుని చిక్కటి ముద్దలా దగ్గరపడుతుంది.

మిశ్రమం దగ్గరపడిన తర్వాత.. ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లం నీటిని టీ జల్లెడతో వడకడుతూ పోయాలి. మంటను సిమ్ లోనే ఉంచి ఉండలు లేకుండా బాగా కలపాలి. బెల్లం నీరు వేసిన తర్వాత మిశ్రమం మళ్లీ పల్చబడి.. ఉడుకుతూ కొద్దిసేపటికి చిక్కబడుతుంది. ఈ సమయంలో మధ్యమధ్యలో 2 నుండి 3 స్పూన్ల నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. హల్వా మిశ్రమం పాన్ నుండి విడివడుతూ ముద్దలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఒక కేక్ టిన్ లేదా స్టీల్ గిన్నెకు అడుగున, అంచుల వెంట నెయ్యి రాయాలి. అడుగున ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను సమానంగా పరవాలి. దానిపై వేడివేడి స్వీట్ మిశ్రమాన్ని పోసి గరిటెతో లోపలికి నొక్కుతూ సమానంగా సర్దాలి. ఈ మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వద్ద కనీసం 1 గంట పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ బోర్లించి తిరగేసి కేక్ టిన్ వెనుక తడితే కేక్ లాగా సులభంగా ఊడి బయటకు వస్తుంది; నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, నోరూరించే హెల్దీ 'రేషన్ బియ్యం కొబ్బరి స్వీట్ కేక్' సిద్ధం! పంచదార, మైదా లేకుండా ఫుల్ క్రీమ్ పాలు, కొబ్బరి కమ్మదనంతో నోట్లో వేస్తే అలా వెన్నలా కరిగిపోతూ పిల్లల నుండి పెద్దల వరకు అమితమైన తృప్తినిస్తుంది!