
కావలసిన పదార్థాలు: బన్సీ గోధుమ రవ్వ – 1 కప్పు, పెసరపప్పు – అర కప్పు, తాజా కరివేపాకు – 1 కప్పు నిండుగా, నీళ్లు – 5 కప్పులు, జీడిపప్పు పలుకులు – ఒక గుప్పెడు, స్వచ్ఛమైన నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, వంట నూనె – 2 నుండి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – అర టీస్పూన్, సన్నగా తరిగిన అల్లం తరుగు – 1 అంగుళం ముక్క, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు – 2 నుండి 3, నల్ల మిరియాల పొడి – అర టీస్పూన్, ఇంగువ పొడి – పావు టీస్పూన్, పసుపు – అర టీస్పూన్, సాల్ట్ – రుచికి సరిపడా.

తయారీ విధానం: ఒక బౌల్లోకి 1 కప్పు బన్సీ గోధుమ రవ్వ, అర కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వీటిని నీళ్లతో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత 1 కప్పు నీళ్లు పోసి 15 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక కప్పు నిండుగా నొక్కిపెట్టి తీసుకున్న తాజా కరివేపాకును నీటితో శుభ్రంగా కడగాలి. మిక్సీ జార్లో కరివేపాకు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఎక్కడా ఆకులు కనిపించకుండా చాలా మెత్తటి నునుపైన జారుడు పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై ప్రెజర్ కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలోకి అర టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే అర టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ ఇంగువ, అర టీస్పూన్ పసుపు వేసి కలపాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్‌ను పోయాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కరివేపాకులోని పచ్చివాసన పూర్తిగా పోయి అంచుల నుండి నూనె వేరయ్యే వరకు నిదానంగా కలుపుతూ వేయించాలి.

కరివేపాకు చక్కగా వేగిన తర్వాత.. అదే కప్పుతో సరిగ్గా 4 కప్పుల నీళ్లు పోయాలి. ఇందులో 1 టీస్పూన్ ఉప్పు వేసి నీటిని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేలా మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో.. నానబెట్టి ఉంచుకున్న బన్సీ రవ్వ, పెసరపప్పును నానబెట్టిన నీళ్లతో సహా కుక్కర్లోకి పోసి బాగా కలపాలి. ఉప్పు సరిచూసుకుని.. కుక్కర్ మూతపెట్టి విజిల్ ఉంచి మీడియం మంటపై 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.

కుక్కర్లోని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలి. కిచిడీ పర్ఫెక్ట్ జారుడు కన్సిస్టెన్సీతో చక్కగా ఉడికి ఉంటుంది; గరిటెతో బాగా కలపాలి. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, పైనుంచి 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి అంతా కలిసేలా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే సూపర్ టేస్టీ 'కరివేపాకు బన్సీ రవ్వ కిచిడీ' సిద్ధం! వేడివేడిగా ప్లేట్లో వడ్డించుకుని.. పండుమిర్చి పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, టమోటా నిల్వ పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో నంజుకుని తింటుంటే కరివేపాకు సువాసన, నేతి కమ్మదనం, అల్లం-మిరియాల ఘాటుతో కలగలిసి అమితమైన ఆరోగ్యాన్ని, అద్భుతమైన రుచినిస్తుంది!