
కావలసిన పదార్థాలు: అర కప్పు గోధుమ రవ్వ అరగంట నానబెట్టినది, అర కప్పు పొట్టు పెసలు గంటపాటు నానబెట్టినవి, ముప్పావు కప్పు బియ్యం లేదా మిల్లెట్స్, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక బిర్యానీ ఆకు, అంగుళం ముక్క దాల్చిన చెక్క, ఐదు లవంగాలు, నాలుగు యాలకులుఒక టీస్పూన్, జీలకర్ర, ఒక టీస్పూన్ అల్లం తరుగు, ఒక పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, ఒక తరిగిన ఉల్లిపాయ, అర కప్పు క్యారెట్ ముక్కలు, మూడు ఫ్రెంచ్ బీన్స్, ఒక బంగాళాదుంప ముక్కలు, ఒక టమాటా, పావు కప్పు పచ్చి బఠాణీ, పావు కప్పు స్వీట్ కార్న్, పుదీనా తరుగు, అర టీస్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర లీటర్లు నీళ్లు .

తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మరియు జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి.

అనంతరం క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, బంగాళాదుంప ముక్కలు వేసి మూడు నుండి నాలుగు నిమిషాలు ఫ్రై చేయాలి. మీకు నచ్చితే లేత సొరకాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఆపై అరగంట నానబెట్టిన గోధుమ రవ్వ, గంటపాటు నానబెట్టిన పొట్టు పెసలు, కడిగిన బియ్యం మరియు టమాటా ముక్కలు వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు వేపాలి.

ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా పుదీనా ఆకులు, పచ్చి బఠాణీ మరియు స్వీట్ కార్న్ గింజలు వేసి బాగా కలపాలి. కూరగాయలు, రవ్వ చక్కగా కలిసిన తర్వాత ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం-హై ఫ్లేమ్‌పై ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి.

ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. కిచిడీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చల్లారే కొద్దీ గట్టిపడుతుంది. అలాంటప్పుడు కాసిన్ని వేడినీళ్లు పోసి ఒక్క నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో కమ్మనైన కతియావాడీ దలియా కిచిడీ సిద్ధం! వేడివేడి కిచిడీపై కాస్త నెయ్యి వేసుకుని పెరుగు చట్నీ లేదా ఆవకాయ, అప్పడాలతో తింటే పొట్టకు ఎంతో హాయిగా, అమృతంలా ఉంటుంది!