
కావలసిన పదార్థాలు: చికెన్ లివర్ 1 కేజీ, పసుపు అర చెంచా, కారం రెండు చెంచాలు, ధనియాల పొడి అర చెంచా, గరం మసాలా అర చెంచా, పచ్చిమిరపకాయలు రెండు, కరివేపాకు రెండు రెమ్మలు, నూనె ఐదు చెంచాలు, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి రెబ్బలు చిన్న కప్పు, అల్లం ముక్కలు చిన్న కప్పు, జీడిపప్పు అర కప్పు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు కొద్దిగా.

తయారీ విధానం: ముందుగా చికెన్ లివర్‌ను నీటితో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కల్లో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. దీనికి మూడు చెంచాల నూనె జోడించి ప్రతి ముక్కకు మసాలాలు అంటేలా చేత్తో బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమంపై మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల ముక్క లోపలి వరకు మసాలాలు ఇంకి మంచి రుచి వస్తుంది.

ఈ లోపు మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వల్ల వేపుడుకు మంచి చిక్కదనం, ప్రత్యేకమైన రుచి సమకూరుతాయి.తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. నూనె వేడయ్యాక సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ-జీడిపప్పు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పేస్ట్ వేగాక మ్యారినేట్ చేసిన లివర్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెడితే లివర్ నుంచి నీరు ఊరుతుంది.

అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ఆ ఊరిన నీటితోనే ముక్క పూర్తిగా ఉడుకుతుంది. నీరు ఇగిరిపోయేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. నూనె పైకి తేలి ముక్క దూదిలా మెత్తగా మారిన తర్వాత, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి.

ఘుమఘుమలాడే ఈ చికెన్ లివర్ ఫ్రైని వేడివేడి అన్నంలో గానీ, చపాతీతో గానీ తింటే అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ వంటకాన్ని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.