
ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు హెయిర్ స్టైల్‌ను రకరకాలుగా సెట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే అనేక రకాల హెయిర్ క్రీమ్‌లు, హెయిర్ జెల్, హెయిర్ స్ప్రేలు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. కానీ వీటిని ఎక్కువగా వాడడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతిని, బలహీనపడతాయని.. తద్వారా జుట్టు త్వరగా రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

అబ్బాయిల్లో ఎక్కువగా జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం ఏమిటంటే.. తరచూ వేడినీటితో తలస్నానం చేయడం. ఇప్పుడు ముందే శీతాకాలం వచ్చేసింది. చాలా మంది వేడి నీటితోనే స్నానం చేస్తారు. ఇది మంచిదే అయినప్పటికీ.. ఎక్కువ వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోయి, జుట్టు పొడిగా, పెళుసుగా మారే ఛాన్స్ ఉంది. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకు చల్లటి నీటితోనే స్నానం చేయండి.

చాలా మంది స్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడే తల దువ్వుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంది. తడి జుట్టును బలంగా దువ్వడం కారణంగా కుదుళ్లు బలహీనపడి త్వరగా రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు స్నానం చేసిన తర్వాత జుట్టును పూర్తిగా ఆరనివ్వండి.. ఆరిన తర్వాతే జుట్టును దువ్వడం స్టార్ట్ చేయండి. అంతేకాదు స్నానం తర్వాత జుట్టును టవల్‌తో తుడిచేటప్పుడు కూడా గట్టిగా కాకుండా నెమ్మదిగా తుడవండి.

అబ్బాయిల్లో జుట్టు ఎక్కువగా రాలడానికి మరో ప్రధాన కారణం.. ఎప్పుడూ తలపై టోపీ లేదా హెల్మెట్ వంటివి ధరించడం. వీటిని నిరంతరం పెట్టుకోవడం కారణంగా తలపై చెమట, రాపిడి ఏర్పడి.. జుట్టు బలహీనపడడంతో పాటు చుండ్రు కూడా పెరుగుతుంది. దీని వల్ల జుట్టు రాలడం, తలపై ఫంగస్ ఏర్పడవచ్చు. కాబట్టి కేవలం అవసరమైనప్పుడు మాత్రమే క్యాప్, హెల్మెట్ వాడండి. చెమట ఆరిపోయేలా అప్పుడప్పుడు మీ జుట్టుకు, తలకు గాలి తగిలేలా చూసుకోండి.

అమ్మాయిల జుట్టు పొడుగ్గా, స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణం వాళ్లు తరచూ నూనె పెట్టి జుట్టును ఆరోగ్యంగా చూసుకుంటారు. కానీ అబ్బాయిలు అసలు నూనెను ఎక్కువగా అప్లై చేయరు.. దీని వల్ల కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంది. కాబట్టి వారంలో రెండు మూడు సార్లయినా తలకు నూనె పెట్టుకోవడం మర్చిపోవద్దు. నూనె పెట్టుకోవడం వల్ల కుదుళ్లు గట్టిపడి జుట్టు స్ట్రాంగ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తం ఈ తప్పులను నివారించి.. మీ జుట్టును ఆరోగ్యంగా చూసుకుంటే.. ఈ జుట్టు రాలే సమస్య నుంచి మీరు బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.