
తయారీకి కావలసిన పదార్థాలు : బియ్యం: 1 కప్పు (పావు కిలో), నీళ్లు (బియ్యం ఉడికించడానికి): 4 కప్పులు (1 లీటరు), బెల్లం: అర కిలో (2.5 కప్పులు), నీళ్లు (బెల్లం కరిగించడానికి): 1 కప్పు, నెయ్యి: అర కప్పు, పచ్చి కొబ్బరి: 1 చిప్ప (మెత్తగా తురిమి లేదా మిక్సీలో గ్రైండ్ చేసి), జీడిపప్పు: పావు కప్పు, ఎండు ద్రాక్ష: పావు కప్పు, ఉప్పు: పావు టీ స్పూన్, యాలకుల పొడి: 1 టీ స్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు తీసుకోవాలి.

ముందుగా 1 కప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గూడాన్నం కోసం అన్నం చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి, ఒక మందపాటి గిన్నెలో కడిగిన బియ్యం వేసి, 4 కప్పుల నీళ్లు పోయాలి. అంటే, పావు కిలో బియ్యానికి ఒక లీటరు నీళ్లు అవసరం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. కావాలంటే అరగంట నానబెట్టి కూడా ఉడికించవచ్చు.

అన్నం ఉడికేలోపు, అర కిలో బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి, స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వేడి చేయాలి. పాకం రానవసరం లేదు, కేవలం బెల్లం కరిగి నీళ్లుగా మారితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీళ్లను పక్కన ఉంచాలి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి.

అన్నం పూర్తిగా ఉడికి, మెత్తగా అయిన తర్వాత, గరిటెతో బాగా మెదిపేయాలి. దధ్యోజనానికి అన్నాన్ని ఎలా మెదుపుతామో, అలాగే మెత్తగా చేయాలి. మెదిపిన అన్నంలో కరిగించుకున్న బెల్లం నీళ్లను వడపోసి పోయాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. అన్నం బెల్లం పాకంలో కలిసే వరకు కుక్ చేయాలి.

అర కప్పు నెయ్యిని కొద్దికొద్దిగా కలుపుతూ ఉండాలి. నెయ్యిని అడుగు నుంచి కలుపుతూ, గూడాన్నం పూర్తిగా దగ్గరపడి, మెరుస్తూ కనిపించేంత వరకు దాదాపు 15-20 నిమిషాలు ఉడికించాలి. ఈ ప్రక్రియ గూడాన్నానికి మంచి రుచినిస్తుంది. ఒక చిన్న కడాయిలో పావు కప్పు నెయ్యి వేడి చేసి, జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి అవి పొంగేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. దగ్గరపడిన గూడాన్నంలో, మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, పావు టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అడుగు నుంచి బాగా కలిపేయాలి.