
తొక్కలోనే అసలైన పోషకాలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జామకాయను తొక్కతో పాటు తినడమే అత్యంత శ్రేయస్కరం. జామ తొక్కలో పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్నవారికి వరం: అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు జామకాయను తొక్క తీయకుండా తినడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

జామకాయ vs జామపండు: జామకాయ, పండు రెండింటిలోనూ పోషకాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చూసే వారికి దోర జామకాయ ఉత్తమం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా కాయే మేలు చేస్తుంది.

జామపండు: ఇది మృదువుగా, తియ్యగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు, వృద్ధులు దీనిని సులభంగా తినవచ్చు. జామపండు త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వృద్ధులు జామను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలో వాపులు, మంటను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి.

మొత్తానికి జామ ఎలా తిన్నా ఆరోగ్యమే.. అయితే మీ శరీర తత్వాన్ని బట్టి, మీకు ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి కాయను ఎంచుకోవాలా లేదా పండును ఎంచుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా తొక్క తీయకుండా తినడం వల్ల పూర్తిస్థాయి పోషకాలను పొందవచ్చని గుర్తుంచుకోండి.