
కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమపిండి, 2 టేబుల్ స్పూన్ల, మరింత క్రిస్పీగా రావడం కోసం బొంబాయి రవ్వ, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నూనె లేదా వెన్న, అర టీస్పూన్ వాము , పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం పొడి , పిండి కలపడానికి తగినన్ని నీళ్లు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె

తయారీ విధానం: ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లో రెండు కప్పుల గోధుమపిండి, రెండు చెంచాల బొంబాయి రవ్వ, వాము, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వేడి నూనెను పిండిలో పోయాలి. చేతితో పిండినంతటినీ నలుపుతూ నూనె ప్రతి రేణువుకూ పట్టేలా బాగా మిక్స్ చేయాలి. పిండిని గుప్పెట్లో పట్టుకుంటే ముద్దలా నిలబడాలి; అప్పుడే గవ్వలు గుల్లగా వస్తాయి.

ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లను చిలకరిస్తూ చపాతీ పిండిలాగా కాస్త గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్‌గా ఉండకూడదు. పిండి ఆరిపోకుండా తడి గుడ్డ లేదా మూతపెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. నానిన పిండి నుండి చిన్న చిన్న శనగగింజ సైజు లేదా చిన్న ఉసిరికాయ సైజు బాల్స్‌లా చేసుకోవాలి. గవ్వల బల్ల (లేదా కొత్త దువ్వెన / ఫోర్క్) పై కొద్దిగా నూనె రాసి, ఒక్కో పిండి ఉండను పెట్టి బొటనవేలితో ముందుకు నెమ్మదిగా రోల్ చేయాలి. దీనివల్ల చక్కటి గవ్వల ఆకారం సులభంగా వచ్చేస్తుంది. చేసిన గవ్వలన్నింటినీ ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి.

బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గవ్వలను నెమ్మదిగా వేయాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌కు అడ్జస్ట్ చేస్తూ గవ్వలను అటూ ఇటూ తిప్పుతూ దోరగా వేయించాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే జాలి గరిటెతో నూనె వడగట్టి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

వేడివేడిగా ఉన్నప్పుడే పైన కొద్దిగా ఉప్పు, కారం పొడిని చల్లి గిన్నెను కుదిపితే గవ్వలకు మసాలా అంతా చక్కగా పడుతుంది. అంతే, నోరూరించే గోధుమపిండి కారం గవ్వలు సిద్ధం! చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే నెల రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి