
ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు అదనపు రుచితో తీపి వంటకం చేయాలనుకుంటే కొబ్బరి కోవా బర్ఫీ రెసిపీని ట్రై చేయండి. ఈ స్వీట్ కేవలం అకేషన్లకు మాత్రమే కాకుండా, ఎప్పుడైనా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు: 1 లీటరు, పచ్చి కొబ్బరి ముక్కలు: 3 కప్పులు (సుమారు 3 కొబ్బరి చిప్పల నుండి), పాల మీగడ: 3-4 టేబుల్ స్పూన్లు ( 1/2 కప్పు మిల్క్ పౌడర్), చక్కెర: 2 కప్పులు, యాలకుల పొడి: 1/2 టీస్పూన్ ను తీసుకోవాలి.

ముందుగా పచ్చి కొబ్బరి చిప్పల నుండి షెల్‌ను తొలగించి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను ఏదైనా కప్పుతో కొలిచి మూడు కప్పులు తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్‌లోకి తీసుకుని, నీరు, పాలు కలపకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత, ఒక లీటరు పాలలో నుండి మిగిలిన పాలను మిక్సీ జార్‌లోకి చేర్చి, కొబ్బరిని మెత్తగా, సాఫ్ట్‌గా అయ్యే వరకు మరోసారి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరి గట్టిగా, కోవా రుచిగా మారుతుంది.

గ్రైండ్ చేసిన కొబ్బరి-పాల మిశ్రమాన్ని ఒక మందపాటి పాన్‌లోకి తీసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి, నిరంతరం కలుపుతూ ఉడికించాలి. ఇలా హై ఫ్లేమ్‌లో ఉడికించడం వల్ల స్వీట్ త్వరగా తయారవుతుంది. పాలు పొంగిపోకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. పైన మీగడ వస్తున్నప్పుడు దాన్ని పాలల్లోకి కలుపుతూ ఉండాలి.

పాలు సగానికి తగ్గిన తర్వాత, మంటను లో ఫ్లేమ్‌కు మార్చాలి. ఈ స్వీట్‌కు రుచిని పెంచే పాల మీగడను కలపాలి. ఒక రోజు ముందు ఒక లీటరు పాలను వేడి చేసి, చల్లార్చి, ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, దానిపై బాగా మీగడ వస్తుంది. ఈ మీగడను మూడు-నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తీసి ఉడుకుతున్న పాలల్లో కలపాలి. మీగడ అందుబాటులో లేకపోతే, అర కప్పు మిల్క్ పౌడర్‌ను కొద్దిగా పాలలో కలిపి ఈ మిశ్రమానికి చేర్చవచ్చు.

ఇప్పుడు స్వీట్‌కు సరిపడా రెండు కప్పుల చక్కెరను కలపాలి. చక్కెర కరిగిన తర్వాత మిశ్రమం మళ్ళీ పలుచబడుతుంది. ఈ సమయంలో మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి, కలుపుతూ ఉడికించాలి. పాలు బయటకు చిందకుండా చూసుకోవాలి. మిశ్రమంలోని పాలు పూర్తిగా తగ్గిపోయి, గట్టిపడి, పాన్‌కు అంటుకోకుండా దగ్గర పడే వరకు నిరంతరం కలుపుతూ ఉడికించాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చేస్తే, అది చక్కగా ఉండలా వస్తే కన్సిస్టెన్సీ సరిపోయినట్లు. ఆ తరవాత స్టవ్ ఆఫ్ చేయాలి. కావాలనుకుంటే, అర టీస్పూన్ యాలకుల పొడిని కూడా ఈ సమయంలో కలుపుకోవచ్చు.