
అందమైన, గ్లోయింగ్ స్కిన్ కోసం చాలామంది రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటి వైద్యం ఫేషియల్ స్టీమింగ్..ఆవిరి పట్టడం. ముఖానికి ఆవిరి పడితే చర్మ రంధ్రాలు తెరుచుకుని, మురికి పోయి చర్మం మెరుస్తుందని అందరూ భావిస్తారు. కానీ, అసలు ఆవిరి పట్టడం వల్ల చర్మానికి ఏం జరుగుతుంది? ఇది నిజంగా పనిచేస్తుందా? అనే విషయాలపై ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ జుష్య భాటియా సరిన్ పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు.

చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయా?: చాలామంది ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయని అనుకుంటారు. కానీ, నిపుణుల ప్రకారం.. ఆవిరి వల్ల పోర్స్ తెరుచుకోవడం లేదా మూతపడటం జరగవు. స్టీమింగ్ వల్ల చర్మం పైపొర మెత్తబడుతుంది. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, అదనపు నూనెలు, మృతకణాలు సులభంగా తొలగిపోతాయి. దీనివల్ల ముఖం తాత్కాలికంగా కాంతివంతంగా కనిపిస్తుంది తప్ప, ముఖంపై ఉండే నల్లటి మచ్చలు లేదా పింపుల్స్ ఆవిరితో మాయం కావు.

ఎంతసేపు ఆవిరి పట్టాలి?: చాలామంది ఎక్కువ సేపు ఆవిరిడితే మంచిదని పొరబడుతుంటారు. డర్మటాలజిస్ట్ సూచన ప్రకారం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆవిరి పట్టాలి. ప్రతిసారీ 2 నుంచి 3 నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అంతకంటే ఎక్కువ సేపు పడితే చర్మం డ్రైగా మారిపోవడం, ఎర్రబడటం లేదా చికాకు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

నీటిలో ఏం కలపాలి?: ఆవిరి పట్టే నీటిలో నిమ్మరసం, ఉప్పు, ఎస్సెన్షియల్ ఆయిల్స్ వంటివి కలపాల్సిన అవసరం లేదని డాక్టర్ జుష్య స్పష్టం చేశారు. కేవలం సాదా నీటిని మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం. రసాయనాలు లేదా నూనెలు కలిపితే కొందరిలో చర్మ అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆవిరి పట్టిన తర్వాత చేయాల్సిన పని: ఆవిరి పట్టిన వెంటనే తువ్వాలుతో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. మెల్లగా తుడుచుకున్న తర్వాత తప్పనిసరిగా మంచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇది చర్మంలో తేమను బంధించి, చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. నిపుణుల సూచనలు పాటిస్తూ సరిగ్గా ఆవిరి పడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.