
ఈ రోజుల్లో ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లను వాడుతున్నారు. అయితే, వీటిని రోజూ సరిగ్గా శుభ్రం చేయకపోతే బాటిల్ లోపల ఒక రకమైన జిడ్డు పేరుకుపోయి, దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా కంటికి కనిపించని బ్యాక్టీరియా, క్రీములు కూడా చేరుతాయి. వీటిని వదిలించడానికి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే దొరికే వెనిగర్, బేకింగ్ సోడా, వేడి నీళ్ల సహాయంతో సులభంగా క్లీన్ చేయవచ్చు. ఈ సహజ సిద్ధమైన చిట్కాలు బాటిల్‌ను లోపలి నుండి మురికి లేనిదిగా చేయడమే కాకుండా, ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా పూర్తిగా శానిటైజ్ చేస్తాయి.

వెనిగర్, వేడి నీళ్ల మ్యాజిక్: వెనిగర్ లో ఉండే అసిడిక్ గుణాలు మొండి మురికిని వదిలించడంలో, బ్యాక్టీరియాను చంపడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బాటిల్‌లో సగం వరకు గోరువెచ్చని లేదా వేడి నీటిని నింపాలి. అందులో 2 నుండి 3 చెంచాల తెల్ల వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే బాటిల్‌లో ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయం బాటిల్ బ్రష్ సహాయంతో లోపల కాస్త రుద్ది, సాధారణ నీటితో కడిగేస్తే లోపలి జిడ్డు వదిలిపోవడమే కాకుండా బాటిల్ సరికొత్తగా మారుతుంది.

బేకింగ్ సోడా ప్రయోగం: బాటిల్ నుండి వచ్చే వింత దుర్వాసనను పోగొట్టడానికి బేకింగ్ సోడా దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాటిల్‌లో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి, అందులో సగం వరకు వేడి నీటిని పోయాలి. బాటిల్ మూత పెట్టకుండా 1-2 గంటల పాటు అలాగే వదిలేయాలి. బేకింగ్ సోడా బాటిల్ లోపల పేరుకుపోయిన వాసనలను పూర్తిగా పీల్చేస్తుంది. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే ఎలాంటి వాసన లేకుండా బాటిల్ ఫ్రెష్‌గా మారుతుంది.

నిమ్మరసం, ఉప్పు: బాటిల్ లోపల తెల్లటి కఠిన జలాల మరకలు ఉంటే.. ఒక నిమ్మకాయ రసం, ఒక చెంచా లావు ఉప్పు బాటిల్‌లో వేయాలి. అందులో కొద్దిగా వేడి నీళ్లు పోసి బాటిల్‌ను గట్టిగా ఊపాలి. ఉప్పు స్క్రాపర్‌లా పనిచేసి లోపలి మురికిని నలిపేస్తుంది. నిమ్మరసం మంచి సువాసనను ఇస్తుంది.

ముఖ్యమైన గమనిక: వాటర్ బాటిల్ క్యాప్ లోపల ఉండే రబ్బర్ రింగ్స్ వద్దే ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి బాటిల్ క్లీన్ చేసేటప్పుడు ఆ రబ్బర్ రింగ్‌ను విడిగా తీసి కొద్దిగా వెనిగర్ నీటిలో నానబెట్టి బ్రష్‌తో శుభ్రం చేయడం మరువకండి. వారానికి కనీసం రెండు సార్లు ఈ చిట్కాలను పాటిస్తే మీ పిల్లల, మీ ఆరోగ్యానికి ఎంతో సురక్షితం!