
కావలసిన పదార్థాలు: ముప్పావు కిలో లేత మటన్, అర కప్పు వంట నూనె, సన్నగా తరిగిన 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 1 పెద్ద టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం పొడి, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా పొడి, గరం మసాలా, గ్రేవీకి సరిపడా బాగా కాగిన వేడి నీళ్లు

తయారీ విధానం: స్టవ్‌పై కుక్కర్ పెట్టి అర కప్పు (100 ml) నూనె పోసి వేడిచేయాలి. నాన్‌వెజ్ కూరలకు నూనె కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

తర్వాత కరివేపాకు, టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తరుగు, పావు టీస్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేలా మీడియం మంటపై వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసి నీరు ఏమాత్రం లేకుండా వడగట్టిన ముప్పావు కిలో మటన్ వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి 5-6 నిమిషాలు కలుపుతూ వేయించాలి; మటన్ నుంచి నీరు ఊరడం ప్రారంభం కాగానే మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించి మూతపెట్టాలి.

మధ్యమధ్యలో కలుపుతూ.. మటన్‌లో ఊరిన నీరంతా పూర్తిగా ఆవిరైపోయి నూనె పైకి తేలే వరకు దాదాపు అరగంట పాటు సన్నటి సెగపై మగ్గించాలి. ఈ స్టెప్పే మటన్‌కి అసలైన రుచిని తెస్తుంది.

నూనె తేలాక కారం పొడి, 3 చెంచాల ధనియాల పొడి, 3 చెంచాల ఎండు కొబ్బరి పొడి, ఈస్టర్న్ మటన్ మసాలా పొడి మరియు దంచి పెట్టుకున్న యాలకులు-జాజికాయ పొడి వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా బాగా మరిగించిన వేడి నీళ్లను మాత్రమే పోయాలి. చల్లటి నీళ్లు పోస్తే కూర ఉష్ణోగ్రత పడిపోయి ముక్క సరిగ్గా ఉడకదు. ఉప్పు, కారం సరిచూసుకోవాలి.