
గుడ్డులోని పచ్చసొన వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు ముప్పు వాటిల్లుతుందనేది ప్రాథమిక అపోహ. అయితే మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పైగా గుడ్డులోని తెల్లసొన కంటే పచ్చసొనలోనే శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, డి, ఇ, కే వంటి కీలక పోషకాలు ఉంటాయి. అదేవిధంగా తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఎక్కువ ఆరోగ్యకరమనుకోవడం పొరపాటే. పెంకు రంగు కేవలం కోడి జాతిని బట్టి మారుతుంది తప్ప, వాటిలోని పోషక విలువల్లో ఎలాంటి తేడా ఉండదు.

ఉడకబెట్టిన గుడ్ల కంటే పచ్చి గుడ్లు తింటే ఎక్కువ బలం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ పచ్చి గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా అనే హానికర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసి వాంతులు, విరేచనాలు, జ్వరానికి కారణమవుతుంది. గుడ్లను సరిగ్గా ఉడికించి తినడం వల్ల ఈ బ్యాక్టీరియా నశించి, శరీరానికి సురక్షితంగా పోషకాలు అందుతాయి. కాబట్టి పచ్చి గుడ్లు తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది.

గుడ్లు తింటే బరువు పెరుగుతారని, లావు అవుతారనే భావన కూడా చాలామందిలో ఉంది. కానీ వాస్తవానికి గుడ్లు బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి. వీటిలో ఉండే అధిక ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి, పదే పదే అతిగా తినే అలవాటును నింత్రిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ జీవక్రియ రేటును పెంచి శరీరంలోని క్యాలరీలను వేగంగా కరిగించడంలో తోడ్పడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో నిర్భయంగా గుడ్లను భాగం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ గుడ్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ వాదనను సమర్థించే ఆధారాలు ఇప్పటివరకు ఏ పరిశోధనలోనూ తేలలేదు. నిజానికి గుడ్లలో ఉండే అవసరమైన పోషకాలు శరీరంలో వాపును తగ్గించి, కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

షుగర్ ఉన్నవారు గుడ్లకు దూరంగా ఉండాలనే అపోహను కూడా నిపుణులు కొట్టిపారేస్తున్నారు. డయాబెటిస్ బాధితులు మితంగా గుడ్లు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరగకపోగా, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా రోజూ పరిమితంగా గుడ్లను ఆహారంలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.