
అరటి తొక్కలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. వీటిని మొక్కలకు ఎరువుగా వాడడం వల్ల మొక్కలు త్వరగా పెరగడతో పాటు వాటికి తెగుళ్లు కూడా రాకుండా కాపాడుతాయి. కాబట్టి ఈ ఆరటి తొక్కలను మొక్కలకు ఎరువుగా ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

అయితే అరటి తొక్కలను ఎప్పుడూ నేరుగా మొక్కల మొదటల్లో వేయరాదు. ఇలా చేయడం వల్ల ఈగలు, చీమలు వచ్చే అవకాశం ఉంది. మీరు అరటి తొక్కలను మొక్క మొదట్లో చిన్న గుంత చేసి ఆ మట్టిలో తొక్కను కప్పెట్టండి లేదా.. వాటిని బాగా ఎండబెట్టి పొడిగా చేసి ఆ పౌడర్‌ను ఎరువుగా మొక్కకు వేయండి. ఇలా చేస్తేనే మీరు వాటి పూర్తి ప్రయోజనాలు పొందుతారు.

లేదంటే మీరు ఈ తొక్కతోనే కంపోర్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కిచెన్‌లో మిగిలి పోయిన ఇతర తడి చెత్తతో కలిపి అరటి తొక్కలను కంపోస్ట్ ఎరువుగా తయారు చేయండి. ఇది బాగా కుళ్లి మట్టిలో కలిసినప్పుడు మొక్కలకు పోషకాలు సంపూర్ణంగా అందుతాయి. తద్వారా మొక్కలు త్వరగా పెరగడమే కాకుండా కాపు కూడా త్వరగా వస్తుంది.

మీరు పెరట్లో టమాటా, వంకాయ, మిరప వంటి మొక్కలు నాటేటప్పుడు ఆ మట్టిలో అరటి తొక్కలను వేయడం వల్ల కాపు ఎక్కువగా వస్తుంది. ఇందుకోసం మీరు అరటి తొక్కలను చిన్న ముక్కలుగా కట్‌చేసి వాటిపై కొద్దిగా వేప పిండి కలిపి ఆ మిశ్రమాన్ని మొక్కలు నాటే మట్టిలో పాతి పెట్టండి.. తర్వాత అదే ప్రాంతంలో మొక్కలు నాటండి. లేదా అరటి చిన్న ముక్కలుగా కోసి ఎండలో బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత పొడిగా చేసి మొక్కల మొదట్లో వేసినా మంచి ఫలితాలు వస్తాయి.

ఈ అరటి తొక్కలను మరో విధంగా కూడా వాడుకోవచ్చు. మీ ఇంట్లో కుండీలలో పెంచే ఇండోర్ మొక్కల ఆకులపై దుమ్ము, దూలి కనుక పడితే.. అరటి తొక్కల లోపలి భాగంతో ఆకులను మెల్లగా తుడవండి.. ఇది ఆకులపై దుమ్మును తొలగించి, అవి సహజంగా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఆకులు ఎప్పుడూ తాజాగా అందంగా కనిపిస్తాయి.