
మనం తగినంత నీరు తాగనప్పుడు శరీరంలో ఏం జరుగుతుందనేది చాలామందికి తెలియదు. రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి నీరు చాలా ముఖ్యం. ఇది రక్త పరిమాణాన్ని కూడా నియంత్రిస్తుంది. కానీ డీహైడ్రేషన్ అయినప్పుడు, శరీరం మనం తీసుకున్న దానికంటే ఎక్కువ నీటిని కోల్పోతుంది. శరీరం లో నీటి స్థాయిలు పడిపోయినప్పుడు, శరీరంలో ప్రసరించే రక్తం పరిమాణం తగ్గుతుందని డాక్టర్ నాయక్ చెప్పారు. దీనివల్ల అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడానికి గుండె మరింత వేగంగా కొట్టుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

అందుకే రక్త ప్రసరణ వ్యవస్థలో నీటి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు గుండె మరింత కష్టపడి పనిచేస్తుందని డాక్టర్ నాయక్ వివరించారు. వ్యాయామం చేసిన తర్వాత లేదా వేడి వాతావరణంలో బయట ఉన్నప్పుడు ఎక్కువగా చెమట పట్టడం వల్ల ఇది జరగొచ్చు. వాంతులు లేదా విరేచనాల వల్ల కూడా ద్రవం కోల్పోవడం ప్రమాదకరమని కార్డియాలజిస్ట్ హెచ్చరించారు.

గుండె వేగం పెరగడం ఒక్కటే కాదు, డీహైడ్రేషన్ కు మరిన్ని సంకేతాలు ఉన్నాయి. అవి ఏంటంటే.. అసాధారణంగా దాహం వేయడం లేదా నోరు పొడిబారడం, మూత్రం సాధారణం కంటే ముదురు రంగులో ఉండటం లేదా తక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం, తలనొప్పి, అలసట లేదా బలహీనత, ముఖ్యంగా నిలబడినప్పుడు తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా స్పష్టమైన దడ. ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా ఉండవచ్చు కాబట్టి, గుండె వేగంగా కొట్టుకుంటే అది కేవలం డీహైడ్రేషన్ మాత్రమే అని నిర్ధారించుకోలేమని ఆయన గుర్తు చేశారు.

డీహైడ్రేషన్ ఎవరికైనా రావచ్చు, కానీ కొన్ని పరిస్థితులలో కొందరికి ప్రమాదం ఎక్కువ. కార్డియాలజిస్ట్ ప్రకారం, ఈ వర్గాల వారు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారు. వేడి లేదా తేమతో కూడిన వాతావరణంలో వ్యాయామం చేసేటప్పుడు చెమట ద్వారా ద్రవం ఎక్కువగా కోల్పోతారు. ద్రవాలను తిరిగి నింపకుండా వ్యాయామం చేస్తే, గుండె వేగం అనుకున్నదానికంటే ఎక్కువ పెరగొచ్చు.

ఎక్కువసేపు వేడిలో ఉండటం వల్ల చెమట, ద్రవ నష్టం పెరుగుతుంది, దాహం లేకపోయినా ఇది జరుగుతుంది. జ్వరం, వాంతులు లేదా విరేచనాలు ఉన్నవారు. ఈ పరిస్థితులు తీవ్రమైన ద్రవ నష్టాన్ని కలిగిస్తాయి, దీనివల్ల శరీరం సాధారణ రక్త ప్రసరణను నిర్వహించడం కష్టమవుతుంది. వృద్ధులు, కొన్ని మందులు వాడేవారు కూడా డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారు.

గుండె వేగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం ఎలా: గుండె వేగంగా కొట్టుకోవడానికి డీహైడ్రేషన్ కారణమైతే, కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడం సహాయపడుతుంది. డాక్టర్ నాయక్ కొన్ని తక్షణ చర్యలను సూచించారు: "డీహైడ్రేషన్ వల్ల గుండె వేగం పెరిగితే, కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడం వల్ల శరీరం కోలుకోవచ్చు. చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా నీరు తాగడం ప్రారంభించండి. ఎక్కువసేపు చెమట పట్టడం వల్ల లేదా వాంతులు, విరేచనాల వల్ల ఎక్కువ ద్రవం కోల్పోయినట్లయితే, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తీసుకోవడం సరైనది" అని కార్డియాలజిస్ట్ చెప్పారు.

అయితే, తగినంత విశ్రాంతి తీసుకుని, ద్రవాలు తాగిన తర్వాత కూడా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఎందుకంటే దడ, గుండె లయ తప్పడం, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, కొన్ని మందులు లేదా ఇతర వైద్య పరిస్థితుల వల్ల కూడా రావచ్చని డాక్టర్ నాయక్ తెలిపారు. ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్యపరమైన సలహా కోసం ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించాలి.