
కావాల్సిన పదార్థాలు : మటన్, ఉల్లి, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపేస్ట్, షాజీరా, లవంగాలు, పచ్చి మిర్చీ , ఒక టమాటా , మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆనియన్ పేస్ట్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, కొత్తిమీర, పూదీనా, నూనె, కారం, ఉప్పు, చిటికెడు పసుపు, కొన్ని నీళ్లు.

తయారీలోకి వెళ్లితే.. ముందుగా, ల ఎముకలతో కూడిన మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. వాటిని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. దీనికి కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఐదు లేదా ఆరు చీల్చిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఒక సగం స్పూన్ పసుపు వేయాలి. తరువాత తగినంత నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి, 10 నుండి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ పూర్తిగా ఉడికి, కుక్కర్ లోపల ఒత్తిడి తగ్గిన తర్వాత మూత తీసి, మటన్ పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు, ఒక వెడల్పాటి కడాయిని తీసుకుని, అందులో సరిప నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు లేదా ఒక పెద్ద ఉల్లిపాయను వేయాలి. ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు, ఒక స్పూన్ కారం పొడి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మసాలాలు నూనెలో బాగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి.

తరువాత, సన్నగా తరిగిన మీడియం సైజు టమాటా వేయాలి. టమాటాలు మెత్తగా మగ్గి, నూనె పైకి తేలే వరకు సుమారు 2-3 నిమిషాలు ఉడికించాలి. మసాలా సిద్ధమైన తర్వాత, ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను మసాలాలో వేయాలి. మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా రెండు మూడు సార్లు కలిపి, స్టవ్ ను హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు ఉంచి, ఆ తరువాత లో ఫ్లేమ్‌లో నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

ఇక చివరగా మనం ఉడకబెట్టి వేసే మసాలాలే కర్రీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అందువలన ఇప్పుడు మంచి రుచికోసం చిటికెడు మిరియాల పొడి వేయండి. ఇది మటన్ కర్రీకి మంచి రుచిని ఇస్తుంది. ఇది వేస్తే మీ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటాడు. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు స్పూన్ తాజాగా నూరుకున్న గరం మసాలా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి, మరో రెండు నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.అంతే, రుచికరమైన పెప్పర్ మటన్ కర్రీ సిద్ధం.