
కావలసిన పదార్థాలు: 1 కప్పు లేత సొరకాయ తురుము, 1 కప్పు బొంబాయి రవ్వ, 2 మీడియం సైజు ఉడికించిన బంగాళాదుంపలు, రవ్వ తీసుకున్న కప్పు కొలతతో 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. పచ్చిమిర్చి మసాలా పేస్ట్ కోసం: 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా తాజా కొత్తిమీర, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ జీలకర్ర, చిటికెడు ఉప్పు. స్పెషల్ చట్నీ కోసం: 1 కప్పు పుట్నాల పప్పు, 5 పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, తగినన్ని నీళ్లు, తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి.

తయారీ విధానం: వెడల్పాటి కడాయిలో 3 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి-కొత్తిమీర మసాలా పేస్ట్, ఒక కప్పు సన్నని సొరకాయ తురుము వేసి బాగా కలపాలి. స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాల పాటు సొరకాయను ఉడకనివ్వాలి.

సొరకాయ కాస్త ఉడికిన తర్వాత సన్నగా తురిమిన బంగాళాదుంప, అర టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కలపాలి. రవ్వ నీటిని పీల్చుకుని ముద్దలా దగ్గరపడే వరకు లో ఫ్లేమ్‌పై ఉడికించి, మూతపెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో ఒక కప్పు పుట్నాలు, 5 పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, తగినన్ని నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ చట్నీకి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి కలుపుకోవాలి. చల్లారిన రవ్వ ముద్దను చేతులను నీటితో తడుపుకుంటూ మృదువుగా పిసకాలి. పెద్ద నిమ్మకాయ సైజు ముద్దను తీసుకుని అరచేతిలో వడలాగా కాస్త మందంగా ఒత్తుకుని, మధ్యలో రంధ్రం పెట్టుకోవాలి.

కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను మీడియం హీట్ చేయాలి. వడలను నూనెలో వేసి, మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తేనే నూనె పీల్చవు. రెండు నిమిషాల పాటు కదపకుండా ఉంచి, ఆ తర్వాత గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే, పైన ఎంతో క్రిస్పీగా, లోపల నోట్లో వెన్నలా కరిగిపోయే 'సొరకాయ రవ్వ వడలు' సిద్ధం! కారకారంగా ఉండే పుట్నాల చట్నీతో వడ్డిస్తే ఇంట్లో అందరూ పదే పదే కావాలని అడుగుతారు.