
కావలసిన పదార్థాలు: 2 గ్లాసుల పొడి బియ్యప్పిండి, 1 స్పూన్ వాము, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, పిండి కలపడానికి సరిపడా మరిగే వేడి నీళ్లు, డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె తయారీ విధానం: రెండు గ్లాసుల పొడి బియ్యప్పిండిని జల్లెడలో వేసి ఉండలు, నలకలు లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. జల్లించడం వల్ల పిండి తేలికపడి చక్రాలు బాగా వస్తాయి. జల్లించిన పిండిలో 1 స్పూన్ వాము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసి పిండి మొత్తానికి సమంగా పట్టేలా చేత్తో బాగా కలుపుకోవాలి.

పక్క స్టవ్‌పై నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న వేడి వేడి నీళ్లను కొద్దికొద్దిగా పిండిలో పోస్తూ గరిటెతో కలపాలి. వేడి నీళ్లు పోయడం వల్ల నూనె పోసే పనే లేకుండా జంతికలు చాలా గుల్లగా వస్తాయి; ఫస్ట్‌లోనే చేత్తో కలపకూడదు. పిండి చేత్తో తాకగలిగే వేడికి వచ్చిన తర్వాత చేతితో బాగా ఒత్తుతూ మృదువైన, సాఫ్ట్ ముద్దలా పిండిని కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉండటానికి పైనుంచి ఒక తడి కాటన్ క్లాత్‌ను కప్పి పక్కన ఉంచుకోవాలి.

జంతికల గొట్టం లోపలి భాగంలో కొద్దిగా నూనెను పూయాలి. కేవలం మొదటిసారి పూస్తే సరిపోతుంది, పిండి అతుక్కోకుండా జారుతుంది. ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిలోంచి కాస్త పెద్ద ముద్దను తీసుకుని మౌల్డ్‌లో నింపి మూత బిగించాలి.

కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడిచేయాలి. కొత్తగా చేసేవారికి వీలుగా ఉండటానికి ఒక చిల్లుల గరిటె వెనుక భాగంలో నూనె రాసి దానిపై జంతికను చుట్టుకోవాలి. ఆ గరిటెను వేడి నూనెలోకి తిరగేస్తే జంతిక సులభంగా నూనెలోకి జారిపోతుంది. నూనెలో వేసిన వెంటనే గరిటెతో కదపకూడదు కదిలిస్తే విరిగిపోతాయి.

మీడియం మంటపై రెండు మూడు నిమిషాలు వేగాక నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోవాలి. నూనెలోని నురగ మరియు పొంగు పూర్తిగా తగ్గిపోయి, లేత బంగారు రంగు రాగానే జల్లి గరిటెతో ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే కరకరలాడే 'బియ్యప్పిండి జంతికలు' సిద్ధం! చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు కరకరలాడుతూ ఫ్రెష్‌గా ఉంటాయి !