
కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు కొత్తిమీర చిన్న కట్టలు : 8 , ఎండుమిరపకాయలు: 1/2 కప్పు (కొత్తిమీర కొలిచిన కప్పుతో), చింతపండు: 1/4 కప్పు , మెంతులు: 1 టీ స్పూన్, ఆవాలు: 1 టీ స్పూన్, నూనె: 1/4 కప్పు (కొలత కప్పుతో, లేదా ఒక మెజరింగ్ కప్పు), పసుపు: 1/2 టీ స్పూన్, ఉప్పు: 2 టేబుల్ స్పూన్లు , ఆవాలు: 1 టీ స్పూన్, జీలకర్ర: 1/2 టీ స్పూన్, మినపప్పు: 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు: 1 టీ స్పూన్, ఇంగువ: 1/4 టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు: 20, ఎండుమిరపకాయలు: 5-6 , కరివేపాకు: 2 రెమ్మలు తీసుకోవాలి.

ముందుగా పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకొని, కాడలతో సహా కట్ చేయండి. కొత్తిమీర పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది. కట్ చేసిన కొత్తిమీరను నీటిలో కనీసం మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన కొత్తిమీరను పొడి క్లాత్ పైన వేసి, రెండు మూడు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వండి. కొత్తిమీరలో తడి ఏ మాత్రం ఉండకూడదు, తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది.బాగా ఆరిన కొత్తిమీరను ఒక గిన్నెతో కొలత పెట్టుకోండి. ఒక గిన్నె నిండా కొత్తిమీర. కొత్తిమీర కొలిచిన అదే కప్పుతో 1/2 కప్పు ఎండుమిరపకాయలు తీసుకొని, తుంచి పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది.

అదే కప్పుతో 1/4 కప్పు చింతపండు తీసుకోండి. చింతపండులో ఉన్న ఈనెలు, విత్తనాలు తీసి శుభ్రం చేయండి. శుభ్రం చేసిన చింతపండులో బాగా వేడిగా ఉన్న నీటిని చింతపండు మునిగే వరకు పోసి, ఒకసారి కలిపి పది నిమిషాలు నానబెట్టండి. చల్లని నీరు వాడవద్దు, వేడి నీరే పచ్చడి నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.

ఒక పాన్ వేడి చేసి, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఎర్రగా వేగేంతవరకు వేయించుకోండి. వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తటి పౌడర్‌గా చేసి పక్కన పెట్టుకోండి.అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, వేడెక్కాక ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసి వేయించండి. మిరపకాయలు మాడనివ్వకుండా, దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే పాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసి, కొలత పెట్టుకున్న కొత్తిమీరను వేసి మీడియం ఫ్లేమ్‌లో రెండు, మూడు నిమిషాలు బాగా వేయించండి. కొత్తిమీర వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే పాన్‌లో కొత్తిమీర కొలిచిన కప్పుతో 1/4 కప్పు నూనె పోసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి పప్పులు ఎర్రగా వేగేంతవరకు వేయించండి.

పప్పులు వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ, కచ్చాపచ్చాగా దంచిన 20 వెల్లుల్లి రెమ్మలు, తుంచిన 5-6 ఎండుమిరపకాయలు వేసి లైట్‌గా వేయించండి. చివరిగా రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించి, స్టవ్ ఆఫ్ చేసి పోపును బాగా చల్లారనివ్వండి. మిక్సీ జార్‌లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, నానబెట్టిన చింతపండు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత, వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ గ్రైండ్ చేసిన పచ్చడి మిశ్రమాన్ని చల్లారిన పోపులో వేయండి. ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడిని కూడా కలిపి మొత్తం బాగా కలిసేంతవరకు కలపండి. రుచి చూసి, అవసరమైతే మరికొద్దిగా ఉప్పు కలుపుకోండి. తయారైన పచ్చడిని తడి లేని గాజు సీసాలోకి తీసుకోండి. సీసాకు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది.